సీమాంధ్రులకు కేసీఆర్ శుభోదయం

Update: 2016-06-02 08:04 GMT
సీమాంధ్రులకు ఊహించని షాక్ ఒకటి ఈ రోజు తగిలింది. నిద్ర లేచి కళ్లు నులుముకుంటూ ఇంటి ముంగిట్లో ఉన్న పేపర్ ను చూసి ఒక్కసారి ఉలిక్కిపడి ఉంటారు. ఎందుకంటే వారే మాత్రం ఇష్టపడని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దర్శనం ఇవ్వటమే కాదు.. ‘‘బంగారు తెలంగాణలో పౌరులంతా సుసంపన్నమైన.. సంతృప్తికరమైన జీవితాన్ని ఆనందించాలని నా కల’’ అన్న కేసీఆర్ కోట్.. ఆ అక్షరాల కిందనే పెద్దసైజు కేసీఆర్ బొమ్మతో ఉన్న ప్రకటనను అచ్చేసిన పత్రిక సీమాంధ్రుడిని శుభోదయం అంటూ పలుకరించింది.

ఎప్పుడూ లేని విధంగా సీమాంధ్రకు వెళ్లే ప్రముఖ దినపత్రికలు అన్నింటిలోనూ తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రకటనల్ని ఇచ్చింది. ఇలా ఒక్క పేజీ కాదు దాదాపు నాలుగు పేజీల ప్రకటనలను ఇవ్వటం గమనార్హం. ఒక రాష్ట్రానికి చెందిన ప్రకటనలు వేరే రాష్ట్రంలో అచ్చేయటం కొత్తేం కాదు. కానీ.. సీమాంధ్రలో ఎప్పుడూ ఇంత భారీగా ప్రకటనలు ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం అందుకు భిన్నంగా ఈసారి ప్రకటనలు ఇవ్వటం విశేషం.

రాష్ట్ర విభజనను పూర్తి స్థాయిలో వ్యతిరేకించే సీమాంధ్రులు.. అందుకు కారణమైన కేసీఆర్ ను అంతగా ఇష్టపడరు. తాము ఈ రోజున ఉన్న పరిస్థితికి కేసీఆరే కారణంగా ఫీలయ్యే వారే ఎక్కువ. ఇదిలా ఉంటే.. అనునిత్యం నిధుల కొరతతో కిందామీదా పడే ఏపీ సర్కారు పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయలేని పరిస్థితి. ఈ రోజున తామున్న దయనీయ పరిస్థితికి కారణం కేసీఆరే అని విశ్వసించే సీమాంధ్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన భారీ ప్రకటన సీమాంధ్రులకు షాక్ తినిపించింది.
Tags:    

Similar News