లోటు రోజురోజుకి పెరుగుతోంది కేసీఆర్‌

Update: 2017-08-02 04:32 GMT
లెక్క‌ల విష‌యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చాలా క‌చ్ఛితంగా ఉంటార‌ని చెబుతారు. ప్ర‌తి సంద‌ర్భంలోనూ సంప‌న్న రాష్ట్ర ధీమాను ప్ర‌ద‌ర్శించే ఆయ‌న‌.. కొంగొత్త ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని దోచుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ప‌థ‌కాల్ని తెర మీద‌కు తీసుకురావ‌ట‌మే కాదు.. రానున్న రోజుల్లో మ‌రిన్ని ప‌థ‌కాలు ప‌క్కా అన్న మాట వినిపిస్తోంది. మ‌రిన్ని ప‌థ‌కాల అమ‌లుకు అవ‌స‌ర‌మైన నిధుల మాటేమిటి? అన్న ప్ర‌శ్న‌కు ఇప్పుడు స‌మాధానం చిక్కింద‌ని చెప్పాలి.

ఎన్నిక‌లు మ‌రో రెండేళ్ల కంటే త‌క్కువ వ్య‌వ‌ధికి త‌గ్గిన వేళ‌లో.. రానున్న రోజుల్లో సంక్షేమ ప‌థ‌కాల మోత మోగిపోవ‌టం ఖాయ‌మంటున్నారు. అందులోకి కేసీఆర్ లాంటి అధినేత వ‌రాల విష‌యంలో ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌ర‌ని చెప్పాలి. అంటే.. ఇప్ప‌టి కంటే రానున్న రోజుల్లో నిధుల అవ‌స‌రం భారీగా ఉండ‌నుంద‌న్న మాట‌. అయితే..  ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభ‌మైన రెండో నెల‌లోనే  రెవెన్యూలోటులోకి ప్ర‌భుత్వం ప‌డిపోవ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అది కూడా వంద‌ల కోట్ల‌లో కాకుండా వేల కోట్ల‌కు చేరుకోవ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ లోటు ఏకంగా రూ.2091 కోట్ల‌కు చేరుకున్న‌ట్లుగా చెబుతున్నారు. గ‌డిచిన మూడు నెల‌ల్లో ప్ర‌భుత్వానికి రెవెన్యూ రిసీట్ల ద్వారా రూ.19,849 కోట్ల ఆదాయం స‌మ‌కూర‌గా.. రెవెన్యూ వ్య‌యం రూ.21,930 కోట్ల‌కు చేరుకున్న‌ట్లుగా తెలుస్తోంది. రెవెన్యూ లోటు పెరుగుద‌ల ఆందోళ‌న విష‌యంలో ఏదైనా సానుకూలాంశం ఉందంటే అది మొద‌టి రెండు నెల‌ల‌తో పోలిస్తే.. మూడో నెల ముగిసేస‌రికి అంత‌కు ముందు న‌డిచిన రెండు నెలల్లో ఉన్న రూ.2673 కోట్ల స్థానే రూ.2091 కోట్ల‌కు ఉండ‌టంగా చెప్పొచ్చు.

ఇదే స‌మ‌యంలో గ‌త ఏడాది తొలి త్రైమాసికంలో ఏర్ప‌డిన రెవెన్యూ లోటుతో పోలిస్తే మాత్రం కాస్త కంగారుప‌డాల్సిందే. ఎందుకంటే గ‌త ఏడాది తొలి త్రైమాసికంలో రెవెన్యూ లోటు రూ.958 కోట్లు కాసా.. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో తొలి మూడు నెల‌ల రెవెన్యూ లోటు రెట్టింపు కంటే ఎక్కువ‌గా రూ.2091 కోట్లుగా ఉండ‌టం ఆందోళ‌న క‌లిగించే అంశంగా చెప్పాలి. ఇక్క‌డో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని చెప్పాలి. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలోని  తొలి త్రైమాసికంలో రాష్ట్ర స్వీయ ఆదాయం కంటే ఈ ఏడాది స్వీయ ఆదాయం 10.92 శాతం వృద్ది సాధించినా లోటు మాత్రం గ‌త ఏడాది కంటే రెట్టింపు ఉండ‌టం గ‌మ‌నార్హం.

వృద్ధి రేటు బాగానే న‌మోదు అవుతున్నా రెవెన్యూ లోటు పెర‌గ‌టానికి కార‌ణాలు ఏంద‌న్న విష‌యాన్ని చూస్తే... సంప‌న్న రాష్ట్రం పేరిట సీఎం కేసీఆర్ ఇస్తున్న హామీల‌తో పాటు.. ప‌లు ప‌థ‌కాలు కూడా కార‌ణంగా చెబుతున్నారు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ‌.. సంక్షేమ ప‌థ‌కాల‌పై ప్ర‌భుత్వం మ‌రింత దృష్టి సారించ‌టం ఖాయం. అదే జ‌రిగితే.. రెవెన్యూ లోటు అంత‌కంత‌కూ పెరుగుతుంద‌న్న ఆందోళ‌న‌లు పెరుగుతున్నాయి. అప్పుల‌కు చెల్లించాల్సిన వ‌డ్డీలు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. గ‌త ఏడాది అప్పుల‌కు వ‌డ్డీల కింద రూ.7995 కోట్లు క‌డితే ఈ ఏడాది అది కాస్తా రూ.11,138 కోట్ల‌ను బ‌డ్జెట్ లోనే కేటాయించ‌టం చూస్తే.. వాస్త‌వంలో మ‌రెంత ఉంటుంద‌న్న‌ది సందేహంగా మారింది. రోజులు గ‌డుస్తున్న‌కొద్దీ అప్పులు అంత‌కంత‌కూ చేస్తున్న నేప‌థ్యంలో ఈ లోటు లెక్క ఎక్క‌డి వ‌ర‌కూ వెళుతుంద‌న్న ఆందోళ‌న క‌ల‌గ‌టం ఖాయం.
Tags:    

Similar News