అలా అంటే హైదరాబాద్ ను దెబ్బ తీసినట్లు కాదా?

Update: 2016-02-21 17:30 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోట ఆసక్తికర వ్యాఖ్య ఒకటి వచ్చింది. హైదరాబాద్ నగరం కిక్కిరిసిపోయిందని.. అందుకే వరంగల్ లో ఐటీని విస్తరిస్తామని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఐటీకి కేరాఫ్ అడ్రస్ గా బెంగళూరు సిటీ ఉంటే.. దాన్ని మరింత విస్తరించేందుకు వీలుగా మైసూర్ నగరాన్ని ఎంపిక చేసి అక్కడకు పలు ప్రాజెక్టులు తీసుకెళుతున్నారు.

ప్రతి రాష్ట్రంలోని కొన్నిరంగాలు ఒక్కచోటే పోగుపోసినట్లుగా ఉండటం తెలిసిందే. సమగ్ర అభివృద్ధికి ఇదేమాత్రం సరి కాదు. అలా అని.. మిగిలిన ప్రాంతాల్ని అభివృద్ధి పర్చాలన్న ఆతృతలో ఇప్పటికే ఇమేజ్ ఉన్న నగరాన్ని దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేయకూడదు. కర్ణాటక సర్కారు మాదిరే తెలంగాణ రాష్ట్రం కూడా ఐటీకి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న హైదరాబాద్ స్థానే.. పక్కనున్న వరంగల్ ను ఐటీ హబ్ గా మార్చాలని భావిస్తోంది.

హైదరాబాద్ తర్వాత వరంగల్ లో ఐటీని ప్రమోట్ చేయటం తప్పేం కాదు. కానీ.. ఒక్క విషయాన్ని కేసీఆర్ మర్చిపోకూడదు. వరంగల్ ను ఎంత ప్రమోట్ చేసినా ఆ పట్టణం హైదరాబాద్ కు ప్రత్యామ్నాయం కాదని. వాతావరణం మొదలుకొని.. మెట్రో కల్చర్.. మౌలికసదుపాయాలు.. మహానగరాల్లో ఉంటే సౌకర్యాలు.. సౌలభ్యాలు వరంగల్ లాంటి పట్టణాల్లో ఉండవన్న విషయాన్ని మర్చిపోకూడదు.

హైదరాబాద్ మహానగరం ఇప్పుడున్న రూపులోకి రావటానికి దశాబ్దాల పాటు కృషి చేయాల్సి వచ్చింది. అదే తరహాలో వరంగల్ కు ప్రాధాన్యత ఇవ్వాలని భావించటం తప్పు కాదు కానీ.. ఆ మాటను పట్టుకొని హైదరాబాద్ కు ప్రాజెక్టులు రాకుండా వరంగల్ ను ప్రమోట్ చేయాలని చూస్తే మొదటికే మోసం వచ్చే వీలుంది. తాజాగా కేసీఆర్ చేసిన ప్రకటననే చూస్తే.. హైదరాబాద్ కిక్కిరిసిపోయిందని.. వరంగల్ లో కంపెనీల్ని విస్తరించాలని ఆయన కోరుతున్నారు. హైదరాబాద్ లో ఉండే చాలా వసతులు వరంగల్ లో ఉండవన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఈ నేపథ్యంలో వరంగల్ లోనే ప్రాజెక్టులు పెట్టాలన్న మాటను ఒత్తిడిగా చేస్తే.. తెలంగాణ రాష్ట్రం కాదనుకొని మరో ప్రాంతానికి తరలిపోయే అవకాశం ఉంది. మొత్తంగా చెప్పేదేమంటే.. వరంగల్ ను ప్రమోట్ చేసేందుకు హైదరాబాద్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. మరి.. ఈ విషయాన్ని కేసీఆర్ గుర్తిస్తారో లేదో..?
Tags:    

Similar News