కేసీఆర్ః ఇంత‌కు ముందు ఒక లెక్క‌.. ఇప్ప‌ట్నుంచి మ‌రో లెక్క‌!

Update: 2021-07-01 07:48 GMT
తెలంగాణ రాష్ట్రంలో రాజ‌కీయాలు ఇంత‌కు ముందు ఒక లెక్క‌.. ఇప్ప‌టి నుంచి మ‌రో లెక్క అనేలా మార‌బోతున్నాయా? కేసీఆర్ మునుప్పెన్నడూ లేనంత ఒత్తిడిని ఎదుర్కోబోతున్నారా? అంటే.. అవును అనే స‌మాధాన‌మే వినిపిస్తోంది. తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియ‌మించ‌డంతో.. లెక్క‌లు పూర్తిగా మార‌బోతున్నాయ‌నే అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు విశ్లేష‌కులు.

2014లో అధికారంలోకి వ‌చ్చింది మొద‌లు ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ.. కేసీఆర్ ను నామ‌మాత్రంగానైనా ఎదుర్కోలేక‌పోయింద‌నేది వాస్త‌వం. ప్ర‌ధాన ప్ర‌తిక్షంగా ధీటుగా నిల‌వ‌లేక‌పోయింది. హ‌స్తం పార్టీలోని గ్రూపు రాజ‌కీయాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఉప‌యోగించుకున్న టీఆర్ఎస్‌.. కాంగ్రెస్ ను నిండా ముంచేశారు. అవ‌కాశం ఉన్న‌వాళ్ల‌ను పార్టీలోకి తీసుకొని.. మిగిలిన వాళ్ల‌ను తొక్కిప‌డేశారు. దీంతో.. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప‌ని అయిపోయింద‌ని స‌గ‌టు జ‌నం కూడా అనుకునేలా చేసేశారు.

ఈ గ్యాప్ వినియోగించుకున్న బీజేపీ రాష్ట్రంలో బ‌లం పెంచుకోవ‌డం కొద్దిమేర స‌ఫ‌ల‌మైంద‌ని కూడా చెప్పొచ్చు. దుబ్బాక‌, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌తో ఆ పార్టీ నేత‌లు ఎక్క‌డికో వెళ్లిపోయారు. ఇక‌, అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అయితే.. అధికారానికి ఒకే అడుగు దూరంలో ఉన్నామ‌ని, రాబోయే ఎన్నిక‌ల్లో గెలుపు త‌మదేన‌ని ప్ర‌క‌టిస్తూ వ‌చ్చారు. అంత‌టితో ఆగ‌కుండా.. కేసీఆర్ ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేశారు. జైలుకు పంపిస్తామ‌ని చెప్ప‌డం నుంచి.. దొంగ వంటి వ్యాఖ్య‌లు కూడా చేశారు. త‌ద్వారా రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తామే అని చెప్పుకున్నారు.

అయితే.. ఇప్పుడు రేవంత్ పీసీసీ చీఫ్ కావ‌డంతో.. లెక్క‌లు మారే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. కేవ‌లం ఫైర్ బ్రాండ్ అన్న ఒకే ఒక్క కార‌ణంతో.. సీనియ‌ర్లంద‌రినీ, వారి అడ్డంకుల‌న్నీ ప‌క్క‌న‌పెట్టింది అధిష్టానం. సో.. దాన్ని నిల‌బెట్టుకునేందుకు రేవంత్ శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తాడ‌ని చెప్ప‌డంలో సందేహ‌మే లేదు. అదే స‌మ‌యంలో కేసీఆర్ తో వ్య‌క్తిగ‌త వైరం కూడా ఉంది. నోటుకు ఓటు కేసులో ఉద్దేశ‌పూర్వ‌కంగా ఇరికించి, త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ ను ప్ర‌మాదంలో ప‌డేశార‌నే ఉక్రోశం కూడా ఉంది. ఇలా రెండు వైపులా రేవంత్ దూకుడు కొన‌సాగించే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఈ విధంగా రెండు వైపుల నుంచి కేసీఆర్ ఒత్తిడి ఎదుర్కోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

మ‌రోవైపు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అనిపించుకునేందుకు.. ఇటు కాంగ్రెస్‌, అటు బీజేపీ మ‌ధ్య మ‌రోసారి పోరు మొద‌ల‌య్యే ప‌రిస్థితి. అయితే.. బీజేపీలో ఎటు చూసినా బండి మాత్ర‌మే క‌నిపిస్తున్నారు. కాంగ్రెస్ విష‌యానికి వ‌స్తే అలా కాదు.. పెద్ద నేత‌లు, సీనియ‌ర్లు ఎంతో మంది ఉన్నారు. వారంద‌రినీ క‌లుస్తున్న రేవంత్‌.. ఒక్క‌తాటిపైకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇది స‌క్సెస్ ఫుల్ గా జ‌రిగితే.. కాంగ్రెస్ పుంజుకోవ‌డం ఖాయం అని అంటున్నారు. అదే జ‌రిగితే.. పూర్వ‌వైభ‌వం దిశ‌గా అడుగులు వేసిన‌ట్టేన‌ని విశ్లేషిస్తున్నారు. మ‌రి, ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి.
Tags:    

Similar News