అకున్ స‌బ‌ర్వాల్‌ కు ఫుల్‌ రైట్స్ ఇచ్చేసిన‌ కేసీఆర్‌

Update: 2017-07-15 13:33 GMT
డ్రగ్స్ కేసు తీవ్రత దృష్ట్యా ఎక్సైజ్ ఎన్‌ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తన సెలవులను రద్దు చేసుకున్న ప‌రిణామం ఇటు రాజ‌కీయ వ‌ర్గాల్లో అటు సినీ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. డ్రగ్స్ కేసు విచారణ పూర్తయ్యే వరకు సెలవులను వాయిదా వేసుకుంటున్నట్లు ఆయన శనివారం ఉదయం ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. అకున్ నిర్ణ‌యం వెనుక ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉన్న‌ట్లు స‌మాచారం. ఓ మీడియా ఛానెల్‌ తో ఫోన్‌ ఇన్‌ లో అకున్ సబర్వాల్ మాట్లాడుతూ ఇదే విష‌యాన్ని ప‌రోక్షంగా తెలిపారు. డ్రగ్స్ రాకెట్ కేసులో పక్కా ఆధారాలతో నోటీసులు జారీచేస్తున్నామ‌ని అన్నారు.  మత్తులో అమాయకుల ప్రాణాలను ఫణంగా పెట్టే ముఠాను వదిలిపెట్టే ప్రసక్తేలేదని...రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ఆదేశాల మేరకు డ్రగ్స్ రాకెట్ ముఠాపై ఉక్కుపాదం మోపుతున్నామ‌ని ప్ర‌క‌టించారు. ముఠా గుట్టు రట్టుచేస్తాం. డ్రగ్స్‌ ను ప్రోత్సహించినవారిని సైతం వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పారు.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న డ్రగ్స్ ముఠా ఆటలు కట్టించేందుకు కఠినచర్యలు తీసుకుంటామని  ఎక్సైజ్ ఎన్‌ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ స్పష్టంచేశారు.  ఎవరి ఒత్తిడికీ భయపడేది లేదని, కేసులో ఎంతపెద్దవాళ్లనైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. తెలంగాణను డ్రడ్స్ విముక్త రాష్ట్రంగా మారుస్తామని, అవసరమనుకుంటే పోలీస్ సాయం తీసుకుంటామని అన్నారు.  తన సెలవులపై వదంతులు వస్తున్న నేపథ్యంలోనే సెలవులు రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కేసు విచారణను పూర్తి చేయాల్సి ఉందన్నారు. కేసు విచారణలో ఎవరి పేర్లు అయినా బయటకు వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్‌తో ప్రమేయం ఉన్నవారందరినీ విచారిస్తామని స్పష్టం చేశారు. 67 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చామని తెలిపారు. విచారణ అనంతరం డ్రగ్స్‌తో ప్రమేయం ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విచారణకు పోలీసుల సహకారం తీసుకుని.. వీలైనంత తర్వగా ఈ కేసును పూర్తి చేస్తామన్నారు.

అకున్ స‌బ‌ర్వాల్ ఈ స్థాయిలో ధీమా వ్య‌క్తం చేయ‌డం వెనుక ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇచ్చిన భ‌రోసా ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌ముఖులైన వారు ఎవ‌రైన ఉన్న‌ప్ప‌టికీ వ‌ద‌లిపెట్ట‌వ‌ద్ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది. అందుకే లీవ్ ర‌ద్దుచేసుకొని మ‌రీ అకున్ స‌బ‌ర్వాల్ రీ ఎంట్రీ ఇచ్చార‌ని, దూకుడుగా వెళ్ల‌డం వెనుక కార‌ణం కూడా ఇదేన‌న్నారు.
Tags:    

Similar News