సభలతో కారు హోరు

Update: 2018-10-02 06:21 GMT
ముందస్తు ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర సమితి తన హోరు - జోరు పెంచుతోంది. ముందుగా అభ్యర్ధులను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిపక్షాల గుండెల్లో కార్లు పరిగెట్టించారు. ఎన్నికల కమిషన్ కూడా తన వేగాన్ని పెంచడంతో ఇక ప్రచారాన్ని ముమ్మరం చేయాలని కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయించారు. ఇందులో భాగంగా బుధవారం నుంచి తెలంగాణలో ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఎన్నికలలోగా వంద సభల్లో పాల్గొంటానని ప్రకటించిన కె.చంద్రశేఖర రావు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం పార్టీ నాయకులను పరుగులు తీయిస్తున్నారు. ముందుగా తన కుమార్తె - లోక్‌ సభ సభ్యురాలు కవిత ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్ జిల్లా నుంచే తన ప్రచారసభలకు ముహుర్తం నిర్ణయించుకున్నారు. ఈ సభకు కనీసం రెండు నుంచి మూడు లక్షల మంది హాజరుకావాలని పార్టీ నిజామాబాద్ జిల్లా నాయకులు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇందుకోసం గడచిన వారం రోజులుగా కసరత్తు కూడా చేస్తున్నారు. ఈ సభలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు దాదాపు గంట సేపు మాట్లాడతారని అంటున్నారు.

నిజామాబాద్ సభ అనంతరం గురువారం నాడు నల్లగొండ సభలో పాల్గొంటారు. ఈ సభను ముఖ్యమంత్రి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి - రద్దయిన శాసనసభలో ప్రతిపక్ష నేత జానారెడ్డి - పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ జిల్లాకు చెందిన వారే. వీరిని ఇక్కడ ఓడించి తెలంగాణ రాష్ట్ర సమితి సత్తా చాటాలన్నది తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు లక్ష్యంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సభ తర్వాత 5 వ తేదీన వనపర్తిలోనూ - 7 వ తేదీన వరంగల్ - 8న ఖమ్మంలోనూ బహిరంగ సభలు నిర్వహించాలన్నది పార్టీ నిర్ణయం.ఈ సభలకు వచ్చే జనాలను బట్టి తమ బలం - బలగం మరోసారి ప్రతిపక్షాలకు చూపించాలన్నది కెసీఆర్ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.  మరోవైపు విపక్షాలు కూడా ఇంకా సీట్ల సర్దుబాటులోనే ఉన్నాయి. వారు ఆ సర్దుబాటు, వివాదాలు ముగించుకునేలోగా తెలంగాణలో బహిరంగ సభల ద్వారా తమ పట్టును మరింత పెంచుకోవాలన్నది తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల వ్యూహంగా చెబుతున్నారు. ఈ వ్యూహంతో ముందుకు వెళ్తే మహాకూటమికి చుక్కలు చూపించవచ్చునని అంటున్నారు.
   

Tags:    

Similar News