రాచకొండ గుట్టల్లో ఫిలింసిటీనా? రిజర్వాయరా?

Update: 2016-03-31 09:50 GMT
 హైదరాబాద్‌ ప్రజల దాహార్తి తీర్చేందుకు రెండు రిజర్వాయర్లు ఏర్పాటుచేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. శాసన సభలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సమగ్ర జల విధానాన్ని వివరిస్తున్న ఆయన  రామోజీ ఫిలింసిటీ సమీపంలో రాచకొండ గుట్టల వద్ద 20 టీఎంసీల సామర్థ్యంతో కూడిన జలాశయం నిర్మిస్తామని తెలిపారు. అదే విధంగా శామీర్‌ పేట వద్ద 20 టీఎంసీల సామర్థ్యంతో మరో రిజర్వాయర్‌ నిర్మిస్తామని తెలిపారు. వీటితో ప్రజల తాగు నీటి ఇబ్బందులను తొలగిస్తామని కేసీఆర్‌ చెప్పారు.
   
తెలంగాణకు కాశ్మీర్ లా ఉండే జిల్లా ఆదిలాబాద్ అని.. వర్షపాతం ఎక్కువ ఉన్నా, ఈ జిల్లాలో దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వలసలు పోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఇక్కడ ఆరు ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ప్రస్తుత సీజన్ లో ర్యాలి వాగు - మత్తడి వాగు పూర్తి చేస్తామని - గొల్లవాగు - నీలివాయి - జగన్నాథపూర్ ప్రాజెక్టులు పూర్తి కావాలన్నారు. 2018 నాటికి కొమురం భీం ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.
   
కాగా హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం జలాశయం నిర్మిస్తామని చెబుతున్న ప్రాంతం రాచకొండ గుట్టల్లో ఫిలింసిటీ నిర్మిస్తామని గతంలో కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. చెప్పడమే కాదు ఆయన అందుకు ఏరియర్ సర్వే కూడా చేశారు. అయితే.. అక్కడ రక్షణ శాఖ విభాగాలకు చెందిన భూములు ఉండడంతో అప్పట్లోనే ఫిలింసిటీ ఏర్పాటులపై అనుమానాలు ముసిరాయి. ఆ తరువాత ఆ ప్రస్తావన కూడా మర్చిపోయారు. తాజాగా అక్కడ జలాశయం నిర్మిస్తామని కేసీఆర్ చెబుతుండడంతో ఇంతకీ అక్కడ ఏం నిర్మిస్తారో అని జనం అనుకుంటున్నారు.
Tags:    

Similar News