కేసీఆర్ రీడిజైనింగ్ కల ఖరీదు ఎంత?

Update: 2016-04-01 06:20 GMT
ఇప్పటివరకూ హైటెక్ సీఎంగా చంద్రబాబుకు ఉన్న పేరు ప్రఖ్యాతుల్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాను చేపట్టిన ఒక్క కార్యక్రమంతో తన ఖాతాలోకి వేసుకున్నారని చెప్పాలి. దేశంలో మరే ముఖ్యమంత్రి చేయని విధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద రాష్ట్ర అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ తయారు చేయటమే కాదు.. మూడు గంటల పాటు నాన్ స్టాప్ గా ఆయనే స్వయంగా.. ఎవరి సాయం తీసుకోకుండా మొత్తం వివరాల్ని గడగడా చెప్పేయటం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇరిగేషన్ లాంటి ఇబ్బందికరమైన సబ్జెక్ట్ ను అరటి పండు ఒలిచినంత సింఫుల్ గా.. అందరికి అర్థమయ్యేలా చెప్పిన కేసీఆర్ ప్రయత్నం అందరి నోట ప్రశంసల వర్షం కురిపించేలా చేస్తుంది.

తన వాదనతో అందరితో మెప్పించే ప్రయత్నం చేయటం కేసీఆర్ కు మామూలే. తన తాజా ప్రజంటేషన్ తో కేసీఆర్ ఒక విషయాన్ని స్పష్టం చేశారు. సమైక్య పాలనలో తెలంగాణకు దారుణమైన మోసం జరిగిందని.. పూడ్చలేనంత అన్యాయం జరిగిందన్న విషయం అందరూ అంగీకరించేలా తన వాదనను వినిపించారు. ఆయన మాటలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చే వారు లేకపోవటంతో.. ఇప్పటికిప్పుడు ఆయన మాటలకు కౌంటర్ ఇచ్చే అవకాశం లేదనే చెప్పాలి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టల కారణంగా జరిగిన నష్టాన్ని తాను సరిదిద్దే ప్రయత్నం చేస్తానన్నది నిన్నటి ప్రజంటేషన్ ముక్తాయింపుగా చెప్పాలి. ఇప్పుడున్న ప్రాజెక్టుల్ని రీడిజైన్ చేయటం.. కొన్నింటిని కొత్తగా నిర్మించటం లాంటివి చేయాలన్నది ఆయన మాట. మరి.. ఆ రీడిజైనింగ్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందన్న విషయాన్ని కేసీఆర్ ఎక్కడా ప్రస్తావించలేదు.

అయితే.. ఆ ఖర్చు లెక్కను చెప్పుకొచ్చారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు భట్టి విక్రమార్క. కేసీఆర్ ఇచ్చిన ప్రజంటేషన్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ చేసే పాపాలను తమకు అంటగడతారన్న ఉద్దేశంతోనే తాము ప్రజంటేషన్ కు రాలేదన్న ఆయన.. ప్రాజెక్టుల రీడిజైనింగ్ కు రూ.2.5లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పుకొచ్చారు. అదే జరిగితే.. ఈ భారం ప్రజల మీద పడుతుందని ఆయన స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్ రంగుల కలను ప్రజలకు చూపించి.. అందరిని మోసం చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కేసీఆర్ చూపించింది రంగుల కలా? కాదా? అన్నది కాస్త పక్కన పెడితే.. రీడిజైనింగ్ కు ఏకంగా రూ.2.5లక్షల కోట్లు ఖర్చు అంటే అంత చిన్న విషయమేమీ కాదు. ఇంత భారీగా పెట్టుబడి పెట్టే సత్తా తెలంగాణ రాష్ట్రానికి ఉందా? అన్నదే పెద్ద ప్రశ్న. అయితే.. భట్టి చెప్పిన ఖర్చు విషయం మీద తెలంగాణ అధికారపక్షం కూడా ఒక స్పష్టత ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News