ఫాంహౌస్ సీఎం..కేసీఆర్ ఏమ‌ని స్పందించాడంటే

Update: 2018-12-03 18:06 GMT
త‌న‌పై వ‌చ్చే విమ‌ర్శ‌ల్లో మొట్టమొద‌టిది - ముఖ్య‌మైన‌ది అయిన విమ‌ర్శ‌కు టీఆర్ ఎస్ పార్టీ అధినేత‌ - తెలంగాణ అప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్  సూప‌ర్ క్లారిటీ ఇచ్చారు. ఇండియా టుడే ప్ర‌తినిధి రాజ్‌ దీప్ సర్దేశాయ్‌ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న అనేక అంశాల‌ను పంచుకున్నారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ... ఈ ఎన్నికలు పూర్తి చేసుకుని జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడానికి అని స‌మాధానం ఇచ్చారు. నాలుగున్నర ఏండ్ల తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలకు అందాల్సిన ఫలాలు అందాయని... రాబోయే కాలంలో కూడా ప్రజలు తమపై విశ్వాసం ఉంచి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ టర్మ్‌ లో మిగ‌తా పనులు పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు సంపూర్ణ సేవ చేసుకున్నామని సంతృప్తి చెందుతామన్నారు.

వ్యవసాయ క్షేత్రంలో ఎక్కువ గడుపుతారు... సెక్రటేరియ‌ట్‌ కు రాని ముఖ్యమంత్రి అని ప్రతిపక్షాల విమర్శలకు మీరేమంటారు అని అడగగా కేసీఆర్ ఆస‌క్తిక‌ర సమాధానం ఇచ్చారు. ప్రజల పాలన కోసం ఎంత సమయం కేటాయించమన్నది ముఖ్యం కాదని... ప్రజల కోసం చేసే పని మనస్పూర్తిగా చేస్తున్నామా లేదా అన్నది ముఖ్యమని తెలిపారు. ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అని ప్రతిపక్షాలు విమర్శలను ఎలా సమర్థిస్తారని అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానం ఇస్తూ ... అది విలాసవంతమైన ఫామ్ హౌస్ కాదు... అది మా తోట మాత్రమేనని వెల్లడించారు. మొదటి నుంచి తాను వ్యవసాయదారుడినని తనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. గులాబి రంగును ఎందుకు ఇష్టపడతారని అడిగిన ప్రశ్నకు పార్టీ గుర్తు కాబట్టి గులాబి కలర్ ఇష్టమని తెలిపారు.

చంద్రబాబు నాయుడు ఒక చెత్త రాజకీయ నాయకుడని కేసీఆర్ విమ‌ర్శించారు.  చంద్ర‌బాబు లీడర్ కాదని మీడియా మేనేజర్ అని విమర్శించారు. గత నాలుగేండ్లుగా బీజేపీతో పనితో కలిపి పనిచేసిన చంద్రబాబు - అప్పుడు కాంగ్రెస్‌ ను తిట్టి ఇప్పుడు కాంగ్రెస్‌ తో పొత్తుపెట్టుకుంటే ప్రజలు చూస్తు ఊరుకోరని తెలిపారు. బీజేపీ, మోడీ ప్రభావం తెలంగాణలో ఎలాంటి ప్రభావం చూపదన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితితో పోటీకి చాలా దూరంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలలో బీజేపీ - కాంగ్రెస్‌ ల పరిస్థితి ఎలా ఉంటుందో మీరే చూస్తారన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన రోజు నేను ఒక్కడినే ఉన్నాను. అనంతరం తెలంగాణ ప్రజానీకం మొత్తం నా వెంట నడిచింది. 17 మందిగా ఉన్న తెలంగాణ ఎంపీలే... దేశ రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నారు. ఉద్యమం ఒక్కడితోనే ప్రారంభమై - దేశమంతటా విస్తరిస్తుందన్నారు. ప్రజలందరూ ఒక్కటైతే రాజకీయ పార్టీలన్నీ వారి వెంట నడవాల్సి ఉంటుందన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రధాన మంత్రి అభ్యర్థిని ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. ప్రధాన మంత్రి పదవి కోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం లేదని రాష్ర్టాలకు కొత్త ఆర్థిక విధానం కోసం కొట్లాడటానికేనన్నారు. డిసెంబర్ 11వ తేదీ తరువాత ఢిల్లీలో ఫెడరల్ ఫ్రంట్ ఎజెండాను ప్రకటిస్తామని పేర్కొన్నారు.

దేశం కోసం ఏదైనా చేయడానికి - బీజేపీ  కాంగ్రెస్ పార్టీ నుంచి దేశ రాజకీయాలను విముక్తి కల్పించాలని భావిస్తున్నామని కేసీఆర్ అన్నారు. ప్రజలకు ఉపయోగం లేని ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని ఎన్నికల్లో గెలుస్తూ పబ్బం గడుపుతున్నాయని మండిపడ్డారు. రాహుల్‌ గాంధీ - సోనియాగాంధీ తెలంగాణలో మీటింగ్ పెట్టి టీఆర్‌ ఎస్ పార్టీ బీజేపీ తొత్తుగా అభివర్ణిస్తారు. మోడీ కూడా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ తొత్తునంటాడు. ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శులు చేసుకుంటూ... దేశ ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ - బీజేపీలతో పొత్తుపెట్టుకునేది లేదని తేల్చి చెప్పారు. గతంలో తెలంగాణ సాధించడం కోసం అందరితో పొత్తు పెట్టుకుని - అన్ని పార్టీలతో జై తెలంగాణ అనిపించామన్నారు. దేశంలోని 42 పార్టీల నాయకులను కలిసి వారి మద్దతు కోరి తెలంగాణ తెచ్చుకున్నామన్నారు.
Tags:    

Similar News