ఆ సీఎం కొడుకు స‌హాయం కోరుతున్న కేసీఆర్‌

Update: 2018-10-05 14:58 GMT
తెలంగాణ అప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త‌న ఎన్నిక‌ల రాజ‌కీయానికి ప‌దునుపెడుతున్నారు. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో గెలిచేందుకు ఏ ఒక్క అవ‌కాశాన్ని వ‌దుల‌కోని కేసీఆర్ ఈ క్ర‌మంలో ఓ ముఖ్య‌మంత్రి కుమారుడి స‌హాయం కోరుతున్నారా?  కీల‌క‌మైన సామాజిక‌వ‌ర్గం మ‌ద్ద‌తు సొంత చేసుకునేందుకు ఆయ‌న ఎన్నిల‌క ఎత్తుగ‌డ‌ల‌ను సిద్దం చేస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. గులాబీ ద‌ళ‌ప‌తి స‌హాయం కోరుతున్న ఆ సీఎం త‌న‌యుడు ఎవ‌రంటే....యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్‌. యాద‌వుల ఓట్ల‌ను కైవ‌సం చేసుకునేందుకు కేసీఆర్ ఈ ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు స‌మాచారం.

దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావడం కోసం ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ కొత్త వేదిక‌ను ప్ర‌తిపాదించిన టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ వివిధ పార్టీల నేతలతో సమావేశం అయిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌ తో ప్రగతి భవన్‌ లో కొద్దికాలం క్రితం కేసీఆర్ స‌మావేశం అయ్యారు. ఈ సందర్భంగా కొత్త రాజకీయ కూటమిపై అఖిలేశ్‌ తో కేసీఆర్‌ చర్చించారు. ఆ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అలా ప‌క్క‌కుపోయిన‌ప్ప‌టికీ తాజాగా మ‌ళ్లీ అఖిలేశ్‌ తో స‌మావేశం అయ్యేందుకు కేసీఆర్‌ ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు స‌మాచారం. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఓట్ల‌ను కైవ‌సం చేకోవ‌డం క‌న్నేసిన గులాబీ దళ‌ప‌తి అఖిలేశ్‌ తో హైద‌రాబాద్‌ లో స‌మావేశం ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఎన్నికల‌ నేప‌థ్యంలో అఖిలేశ్ యాద‌వ్‌ తో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించేందుకు ఆస‌క్తిగా ఉన్న‌ట్లు స‌మాజ్‌వాదీకి చెందిన నాయ‌కుల‌తో ప్ర‌తిపాద‌న‌లు పెట్టిన‌ట్లు స‌మాచారం.

యాద‌వ ఆత్మ‌గౌర‌వ స‌భ పేరుతో ఎల్‌ బీ స్టేడియంలో భారీ బ‌హిరంగ స‌భ‌ ఏర్పాటుకు టీఆర్ ఎస్ పార్టీ రెడీ అవుతూ దీనికి ముఖ్య అతిథిగా అఖిలేశ్‌ ను  ఆహ్వానించిన‌ట్లు స‌మాచారం. ఈ స‌భ ద్వారా తెలంగాణ‌లోని యాద‌వ‌ - కురుమ‌ల ఓట్ల‌ను కైవ‌సం చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు స‌మాచారం. గొల్ల కురుమ‌ల‌కు పంపిణీ చేసిన గొర్రె పిల్ల‌లు - వాటి ద్వారా క‌లిగిన మేలు - గ‌తంలో ఏ పాల‌కుల‌కు రాని ఆలోచ‌న వంటి ఆలోచ‌న అనే అంశాల‌ను ఈ స‌భ ద్వారా తెలియ‌జెప్ప‌నున్న‌ట్లు స‌మాచారం. స‌హ‌జంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గొల్ల‌కురుమ‌ల‌ను ఈ సభ‌కు త‌ర‌లించ‌నున్న‌ట్లు చెప్తున్నారు.


Tags:    

Similar News