ఏమో.. కేసీఆర్ గుర్రం ఎగురావచ్చు..!

Update: 2018-07-20 04:42 GMT
ఆశయం గొప్పదే.. కానీ ఇంత పెద్ద రాష్ట్రంలో దాని ఆచరణే కష్టం.. రెండేళ్లలో పూర్తి చేద్దామనుకున్న మిషన్ భగీరథ పథకం ఇప్పటికీ పూర్తికాలేదు. తాజాగా సీఎం కేసీఆర్ డెడ్ లైన్ విధించారు. ఆగస్టు 14లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అంతా ఓకే.. కానీ ఇప్పటికీ వివిధ ప్రాంతాల్లో పైపులైన్ల లీకేజీలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. పనులు పూర్తి స్థాయిలో కాలేదు.  అన్నీ పూర్తయినా కీలకమైన అసలు సంగతిని కేసీఆర్ మరిచిపోవడం నివ్వెరపరుస్తోంది.

మిషన్ భగీరథ.. తెలంగాణలోని ఇంటింటికి నీరందించే అద్భుత పథకం.. నో డౌట్.. ఇది దేశవ్యాప్తంగా ప్రచారం పొందింది. అయితే ఈ పథకం విజయవంతం కావాలంటే ప్రధానంగా కావాల్సింది నీరు. ఈ నీటిలో ఎక్కువ భాగంగా గోదావరి నుంచి రావాలి. తెలంగాణలో ఇప్పుడిప్పుడే వానలు మొదలయ్యాయి. ఉత్తర తెలంగాణలోని శ్రీరాంసాగర్ లోకి పెద్దగా వరద రాలేదు. మహారాష్ట్ర ఇబ్బడి ముబ్బడిగా ప్రాజెక్టులు కట్టడంతో శ్రీరాంసాగర్ వట్టిపోతోంది. ఇక ఆ తర్వాత దిగువన ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కాస్త వరద వచ్చింది. దాదాపు 23 టీఎంసీల ఈ ప్రాజెక్టు హైదరాబాద్ తాగునీటి అవసరాలు.. చుట్టుపక్కల ఎత్తిపోతల పథకాలకే సరిపోతుంది. ఇక తెలంగాణ తాగునీటి అవసరాలు తీర్చే ఉద్దేశంతో మొదలు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు వరదనీటితో ఆటంకాలు ఏర్పడ్డాయి. ఆ ప్రాజెక్టు ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. అక్కడ పెద్దగా నిల్వ చేయడానికి వీలు లేదు.. కాళేశ్వరం తప్పితే తెలంగాణలో నీటిని ఆపే పెద్ద ప్రాజెక్టే లేదు.

 ఇలా గోదావరిలో ప్రస్తుతానికైతే నీరు లేదు. మరి కేసీఆర్ ప్రారంభించే మిషన్ భగీరథకు నీటిని ఎక్కడి నుంచి తెస్తాడన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.. అప్పటి వరకూ వర్షాలు కురవకపోవా అనే వారు లేకపోలేదు. కానీ ఆ వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నది నగ్న సత్యం. శ్రీరాంసాగర్ లోకి ఎలాగూ వరద నీరు వచ్చే చాన్స్ లేదు. కింద వస్తున్నా ఆపడానికి ప్రాజెక్టు లేదు. ఈ నేపథ్యంలో మిషన్ భగీరథ పథకానికి నీరు ఎక్కడి నుంచి కేసీఆర్ తెస్తాడన్నది ఇప్పుడు అందరిమదిని తొలస్తున్న ప్రశ్న.. మరి ఈ అపరభగీరథుడు ఆగస్టు 14న మిషన్ భగీరథ  పూర్తి చేశాక ఏం చేస్తాడన్నది వేచిచూడాల్సిందే..
Tags:    

Similar News