మోడీ సర్కారుకు షాకిచ్చే ప్లాన్ బడ్జెట్ చెప్పిన కేసీఆర్

Update: 2021-11-30 04:36 GMT
కోపం రానంత వరకు ఓకే. ఒకసారి తేడా వస్తే మాత్రం ఎంతోడినైనా సరే.. బరాబర్ చూసుకుందామన్నట్లుగా మాట్లాడే ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సుపరిచితులు. కేంద్రంలో మోడీ సర్కారు కొలువు తీరి దాదాపు ఏడున్నరేళ్లు అవుతుంది. మొదటి టర్మ్ లో ఆయన తీసుకున్న నిర్ణయాలు కొన్ని చర్చకు వస్తే.. రెండో టర్మ్ లో ఆయన తీసుకున్న నిర్ణయాలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలాంటి సమయంలోనూ పెదవి విప్పకుండా.. ఆ మాటకు వస్తే తనకు పట్టనట్లుగావ్యవహరించిన బీజేపీయేతర ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ ఒకరు.

అలాంటి ఆయన మోడీ సర్కారుపై ఇప్పుడు గరంగరంగా ఉన్నారు. తాము కోరుకున్నట్లుగా ధాన్యాన్నికొనుగోలు చేసే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆయన.. తమ నిరసనను తెలియజేసేందుకు వీలుగా భారీ ప్లానింగ్ తో ఉన్నానన్న విషయాన్ని ఆయన చెప్పేశారు. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఒక దశలో మోడీ సర్కారుకు షాకిచ్చేందుకు తమ ప్రభుత్వం రూ.200 కోట్లు ఖర్చుకైనా వెనుకాడమన్న విషయాన్ని చెప్పేయటం సీఎం కేసీఆర్ కు మాత్రమే చెల్లుతుందని చెప్పాలి.

ఇంతకూ ఆయన చెప్పిందేమంటే.. వానాకాలం ధాన్యం సేకరణకు కేంద్రం హామీ ఇవ్వటం లేదని.. కేంద్రం సేకరణ40 లక్షల టన్నులు దాటటం లేదన్న కేసీఆర్.. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. కేంద్రం కానీ ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే.. వెయ్యి లారీలతో వడ్లనుఢిల్లీలోని బీజేపీ.. ప్రధానమంత్రి కార్యాలయాల ముందు పోస్తామన్నారు. వెయ్యి లారీలు పెట్టి ధాన్యాన్ని తీసుకొని ఢిల్లీలోని ఇండియా గేటు వద్ద పారపోస్తామన్నారు.
వర్షాకాలంలో ఎంతైనా కొంటామని కిషన్ రెడ్డి చెబుతున్నారని.. ఒకవేళ కొనకుంటే మాత్రం ఆయన ఇంట్లో కూడా ధాన్యం పోసతామని రూ.200 కోట్లు ఖర్చు అయినా సరే ఢిల్లీకి తీసుకెళ్లి పోస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోడీ సర్కారుకు తమ నిరసన తెలిపేందుకు రూ.200 కోట్ల ఖర్చుకు సైతం వెనుకాడనట్లుగా ఉన్న కేసీఆర్ మాటలు.. ప్రాక్టికల్ గా సాధ్యమా? అన్నది మరో ప్రశ్న.

ఎందుకంటే..తెలంగాణ నుంచి దేశ రాజధానికి వెయ్యి లారీలతో ధాన్యాన్ని తీసుకెళుతుంటే.. ఇతర రాష్ట్రాల్లోని బీజేపీ ఏలుబడిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుంటాయా? అన్నది కూడా ప్రశ్నే. ఆ విషయాన్ని పక్కన పెడితే.. మోడీ తీరుపై తానెంత ఆగ్రహంగా ఉన్నాన్న విషయాన్ని రూ.200 కోట్ల ఖర్చుతో చేస్తానన్న నిరసన కార్యక్రమం సైజును చూస్తే ఇట్టే చెప్పేయొచ్చు.
Tags:    

Similar News