మోడీ ముందు సారు గొప్పతనం దేశానికి తెలియనుందా?

Update: 2020-04-26 23:30 GMT
దేశంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ పేరు కూడా ఉంది. శనివారం నాటికి 990 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొన్నటివరకూ సాగిన జోరు.. గడిచిన మూడు రోజులుగా తగ్గుతోంది. శనివారం మరింతగా తగ్గిపోయి సింగిల్ డిజిట్ కు పరిమితం కానుంది. ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలకు ప్రతిగానే ఫలితాలు వస్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. కరోనా చైన్ బ్రేక్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే ఫలిస్తున్న వేళ.. మరింత కఠినంగా వ్యవహరించటం ద్వారా కరోనా లెక్కను ఒక కొలిక్కి తీసుకురావొచ్చన్న ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. అంతేకాదు.. మరో రోజులో ప్రధానమంత్రి మోడీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్సులో తెలంగాణ ప్రభుత్వ సమర్థత దేశానికి తెలియనుంది.

గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్యను కట్టడి చేయటంలో ప్రభుత్వం విజయవంతమైన తీరును ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పనున్నట్లుగా తెలుస్తోంది. కేసుల నమోదు తగ్గుతున్న వేళ.. ఏ మాత్రం రిలాక్స్ కావొద్దని.. మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. కరోనా సోకిన వారిని గుర్తించటమే కాదు.. వారి కాంటాక్టును సైతం గుర్తించి ముందస్తుగా వారిని క్వారంటైన్ చేస్తున్న వైనాన్ని ప్రధాని సమీక్షలో కేసీఆర్ ప్రస్తావించనున్నట్లు చెబుతున్నారు.

కొత్త కేసుల రాకుండా చూడటమే తమ ముందున్న లక్ష్యంగా తెలంగాణ సర్కారు పెట్టుకుంది. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలపై తాజాగా కేంద్రం నుంచి వచ్చిన టీం సైతం మెచ్చుకున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది. ఈ నెల 27 (సోమవారం)న ప్రధాని మోడీ సమక్షంలో నిర్వహించే వీడియో కాన్ఫరెన్సులో కరోనా పాజిటివ్ కేసుల నమోదుపై రాష్ట్రాల వారీగా రివ్యూ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో అమలు చేసిన విధానం.. దానికి తగ్గట్లే తగ్గిన పాజిటివ్ కేసుల వైనాన్ని యావత్ దేశం తెలిసేలా తెలంగాణ ప్రభుత్వం తన వాదనను వినిపించనుంది. కరోనాను కంట్రోల్ చేయటంలో సీఎం కేసీఆర్ మొనగాడితనాన్ని దేశానికి పరిచయం చేయటానికి సీఎం కేసీఆర్ ఆసక్తిని ప్రదర్శిస్తున్నారని చెబుతున్నారు. మరి.. ఆయన కోరిక ఎంతమేర తీరుుతుందో చూడాలి.

Tags:    

Similar News