విరుచుకుప‌డినా.. కేసీఆర్ మ‌ద్ద‌తు మోడీకేన‌ట‌!

Update: 2017-05-29 06:36 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చ‌తుర‌త చాలా సిత్రంగా ఉంటుంది. ఆయ‌న ఎవ‌రితోనూ దీర్ఘ‌కాలం శ‌త్రుత్వాన్ని నెర‌ప‌రు. అదే స‌మ‌యంలో స్నేహాన్ని కూడా. అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. అవ‌స‌ర‌మైతే చెట్టెక్కి కూర్చునే ఆయ‌న‌.. త‌ప్ప‌ద‌నుకుంటే కింద‌కు దిగి వ‌స్తారు కూడా. అధికారంలో ఉంది కాబట్టి అహంభావం మామూలే అన్నంత‌లోనే.. త‌న‌కు అలాంటివేవీ ఏ కోశానా ఉండ‌ద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించి ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే.. చాలా బాగా తెలిసినట్లుగా ఉంటూనే.. త‌న గురించి ఎదుటోళ్ల అంచ‌నాల‌కు అంద‌కుండా ఉండ‌టం కేసీఆర్ కు బాగా అల‌వాటు.

మొన్న‌టికి మొన్న తెలంగాణ రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చి.. మూడు రోజుల పాటు మకాం వేసిన బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా తెలంగాణ రాష్ట్ర స‌ర్కారుపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రం అందిస్తున్న నిధులు ప‌క్క‌దారి ప‌డుతున్న‌ట్లుగా ఆయ‌న వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి భారీగా నిధులు అందుతున్న‌ట్లుగా ఆయ‌న వ్యాఖ్య‌లు చేయ‌టంపై కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.

అమిత్ షా చెప్పిన మాట‌లు కానీ నిజ‌మైతే.. త‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని స‌వాలు విస‌ర‌ట‌మే కాదు.. తెలంగాణ‌ను ఇంత‌గా అవ‌మానిస్తారా? అంటూ భావోద్వేగ అంశాన్ని బ‌య‌ట‌కు తీశారు. తెలంగాణ రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన అమిత్ షా.. త‌న‌ను నాలుగు మాట‌లు అన్నా పెద్ద‌గా ప‌ట్టించుకునేవాడిని కాన‌ని.. కానీ ఆయ‌న ఏకంగా తెలంగాణ ప్ర‌తిష్ఠ‌ను దెబ్బ తీసేలా వ్య‌వ‌హ‌రించారంటూ నిప్పులు చెరిగారు.

అన్నింటికి మించి అమిత్ షాను భ్ర‌మిత్ షాగా అభివ‌ర్ణించి.. ఒక రేంజ్లో చెల‌రేగిపోయారు. రెండు రోజులు గ‌డిచే స‌రికి మ‌రో చిత్రానికి తెర తీశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాను స‌ర్వే చేయించాన‌ని.. ఇప్ప‌టికిప్పుడు కానీ ఎన్నిక‌లు జ‌రిగితే.. టీఆర్ఎస్‌కు 111 స్థానాలు ప‌క్కా అని మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేసి మ‌రీ చెప్పేశారు. టీడీపీ.. బీజేపీలైతే త‌మ ఖాతాను కూడా తెర‌వ‌లేవ‌ని తేల్చేశారు.

ఇలా ఒక‌టి త‌ర్వాత ఒక‌టి చొప్పున విరుచుకుప‌డిన కేసీఆర్ తీరును చూసినోళ్లంతా కేంద్రంపై క‌స్సుమంటార‌న్న అంచ‌నాలు వేశారు. నిజంగా అలా చేస్తే ఆయ‌న కేసీఆర్ ఎందుకు అవుతారు?  ఇందుకు త‌గ్గ‌ట్లే తాజాగా త‌న‌లోని విల‌క్ష‌ణ‌త‌ను మ‌రోసారి ప్ర‌ద‌ర్శించారు. వారంలో రెండోసారి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌తో భేటీ అయిన సీఎం.. రానున్న రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో మోడీ వ‌ర్గం ఎంపిక చేసిన అభ్య‌ర్థికి త‌మ మ‌ద్ద‌తు ఇవ్వ‌నున్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేశారు. అధికారికంగా ప్ర‌క‌టించ‌కున్నా.. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల వ్య‌వ‌హారం తెర మీద‌కు రాగానే.. త‌మ పార్టీ మ‌ద్ద‌తు ఎన్డీయే అభ్య‌ర్థికి ఉంటుంద‌న్న విష‌యాన్ని గ‌వ‌ర్న‌ర్ కు చెప్పిన‌ట్లుగా స‌మాచారం. తాను గ‌వ‌ర్న‌ర్ తో చెప్పిన మాట‌ల్ని లీకుల రూపంలో బ‌య‌ట‌కు తీసుకురావ‌టం చూస్తే.. కేసీఆర్ రాజ‌కీయ చాణుక్యం ఎలా ఉంటుంద‌న్న‌ది ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీసేలా ప్ర‌య‌త్నించిన అమిత్ షా ప్ర‌య‌త్నం మీద‌నే త‌న ఆగ్ర‌హం త‌ప్పించి.. బీజేపీ మీద అస్స‌లు లేద‌ని.. మోడీ మీద అస‌లు లేద‌న్న విష‌యాన్ని త‌న తీరుతో కేసీఆర్ స్ప‌ష్టం చేశార‌న్న మాట వినిపిస్తోంది. కొద్ది వారాల త‌ర్వాత జ‌రిగే రాష్ట్రప‌తి ఎన్నిక‌కు త‌న మ‌ద్ద‌తు ఎన్డీయే అభ్య‌ర్థికే ఇస్తాన‌న్న విష‌యాన్ని ఇప్ప‌టికిప్పుడు గ‌వ‌ర్న‌ర్ కు చెప్పాల్సిన అవ‌స‌రం ఏమిట‌న్న ప్ర‌శ్న‌లోనే.. స‌మాధానం క‌నిపిస్తుంది. అందుకే చెప్పేది.. కేసీఆర్ ఆగ్ర‌హం సైతం వ్యూహాత్మ‌కంగా ఉంటుందే త‌ప్పించి.. అన‌వ‌స‌రంగా అస్స‌లు ఉండ‌దు. ఆయ‌న నోటి నుంచి  ఒక తిట్టు వ‌చ్చినా దానికో కార‌ణం, వ్యూహం ఉంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News