మోడీ...కేసీఆర్‌..మ‌ధ్య‌లో ఫెడ‌ర‌ల్‌ ఫ్రంట్ చ‌ర్చ‌

Update: 2018-05-28 06:46 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న అనేక ఆస‌క్తిక‌ర‌మైన అంశాలకు వేదిక‌గా మారింది.జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడానికి ముఖ్యమంత్రి కేసీఆర్.. క్యాబినెట్ సమావేశం అనంతరం ఆదివారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ - హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ లతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. దాదాపు మూడు నెల‌ల త‌ర్వాత ఢిల్లీ వెళ్తున్న కేసీఆర్ ఈ సంద‌ర్భంగా రెండు కీల‌క కార్య‌క్ర‌మాలు పెట్టుకున్నారు. ఒక‌టి త‌న వ్య‌క్తిగ‌తం అయితే...రెండు రాష్ట్రహితం. వ్య‌క్తిగ‌త హితానికి వ‌స్తే ఆయ‌న ఆరోగ్య స‌మ‌స్య‌లకు పరీక్ష‌లు చేయించుకోనున్నారు. నాలుగురోజుల ప‌ర్య‌ట‌న‌లో ఈ ప‌రీక్ష ఉండ‌నుంది. అయితే దీనికి తోడుగా ప‌లు ఎజెండాల‌తో ఆయన ఢిల్లీ బాట ప‌ట్టారు.

అయితే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీలో ఏం చ‌ర్చించ‌నున్నారు అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఎందుకంటే...కేసీఆర్ క‌ల‌లు కంటున్న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఎత్తుగ‌డ‌. జాతీయ రాజ‌కీయాల్లో గుణాత్మ‌క మార్పు రావాల‌ని కోరిన కేసీఆర్ ఇందుకు సంబంధించిన ప్ర‌క్రియ‌ను కూడా మొదలుపెట్టి ప‌లువురు నేత‌ల‌ను క‌లిసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధానంగా కేసీఆర్ క‌లిసిన నాయ‌కులంతా ప్ర‌ధాని మోడీపై భ‌గ్గుమంటున్న వారే! ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం - తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తాబెన‌ర్జీ - జేడీఎస్ నాయ‌కుడు దేవెగౌడ - క‌న్న‌డ నేల‌పై షాకిచ్చిన కుమార‌స్వామి - డీఎంకే ర‌థ‌సార‌థులు కుర‌ణానిధి - స్టాలిన్ - యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్‌ వంటివారు ఈ జాబితాలో ఉన్నారు. ఫ్రంట్ ఆలోచ‌న చేయ‌డం, ఈ నేత‌ల‌ను క‌ల‌వ‌డం అనంత‌రం కేసీఆర్ చేస్తున్న ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఇదే.

ఈ సంద‌ర్భంగా మోడీకి వ్య‌తిరేకంగా ఫ్రంట్ ఎత్తుగ‌డ వేసి...అనంత‌రం ఆయ‌న‌తోనే భేటీ అవ‌డంతో ఈ స‌మావేశంపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఈ స‌మావేశంలో కేసీఆర్ టీం చెప్తున్న‌ట్లుగా రాష్ర్టానికి సంబంధించిన అంశాలే చ‌ర్చ‌కువ‌స్తాయా?  రాజ‌కీయ అంశాలు ప్ర‌ధానంగా కేసీఆర్ చేస్తున్న ఫ్రంట్ అంశాలు కూడా చ‌ర్చ‌కు రానున్నాయా? అనేది అంద‌రిలోనూ ఆస‌క్తిని రేకెత్తిస్తున్న అంశం.
Tags:    

Similar News