మోడీ-కేసీఆర్.. భేటి వెనుక కథ ఇదే..

Update: 2018-06-14 04:44 GMT
తిట్టుకున్నారు.. కొట్టుకోవడం ఒకటే తక్కువ.. కానీ ఇప్పుడు తిట్టుకున్న నోళ్లే ఆప్యాయంగా పలకరించబోతున్నాయి. మీరు వేస్ట్ అన్న నోటితోనే మీరే మా పథకాలకు చీఫ్ గెస్ట్ అని ఆహ్వానించాల్సిన పరిస్థితి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండరనడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు తాజా ఉదాహరణ..

మొన్నటికి మొన్నే మోడీపై కేసీఆర్ తిరుగుబాటు చేశారు. 50 ఏళ్ల కాంగ్రెస్ - 15 ఏళ్ల  బీజేపీ పాలన వేస్ట్ అంటూ సంచలన విమర్శలు చేశారు. వీరివురి పాలనలో దేశం వెనక్కి వెళ్లిందంటూ ఉదాహరణ చూపించారు. మోడీపై ఎన్నో ఆశలు పెంచుకున్నామని.. కానీ ఆయన దేశ ప్రజల ఆశలు తుంచేశాడని విమర్శించారు. అంతేకాదు కాంగ్రెస్-బీజేపీ ముక్త  భారత్ కోసం దేశ ప్రజలందరూ ఫెడరల్ ఫ్రంట్ కు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఈ ఫ్రంట్ కు మద్దతుగా దేశవ్యాప్తంగా తిరిగి మమతాబెనర్జీ - అఖిలేష్ - దేవెగౌడ - స్టాలిన్ తదితర ప్రాంతీయపార్టీల నేతలను కలిసి ఫ్రంట్ ప్రాముఖ్యతను వివరించారు.

ఫ్రంట్ సమీకరణాల్లో భాగంగా మోడీపై తీవ్ర విమర్శలు చేశారు కేసీఆర్. కర్ణాటకలో అయితే  నటుడు ప్రకాష్ రాజ్ తో కలిసి మోడీపై విరుచుకుపడ్డారు. ఇలా ప్రధానిని టార్గెట్ చేసి రాజకీయాలు చేసిన కేసీఆర్ ఇప్పుడు ప్రధానిని ఢిల్లీలో కలవబోతుండడం ఆసక్తి రేపుతోంది.

కొద్దిరోజుల క్రితం ప్రధాని అపాయింట్ మెంట్ రాగా కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. చివరి నిమిషంలో భేటి రద్దు కావడంతో కేసీఆర్ ప్రధానిని కలువలేకపోయారు. హోంమంత్రిని కలిసి రాష్ట్ర సమస్యలు, జోన్లకు ఆమోదం కోసం చర్చించారు. తాజాగా ప్రధాని కార్యాలయం నుంచి ప్రధాని అపాయింట్ మెంట్ ఖరారు కావడంతో ప్రధానిని కలుస్తున్నారు. దాదాపు 7 నెలల తర్వాత వీరి భేటి ప్రాధాన్యం సంతరించుకుంది. ముందు ఎందుకు ప్రధాని నో అన్నారు.. ఇప్పుడు ఎందుకు పిలిచి మరీ కలుస్తున్నారన్నది రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.

కర్ణాటక సీఎంగా కుమారస్వామి నామినేట్ అయ్యాక కాంగ్రెస్ -జేడీఎస్ ప్రభుత్వ మంత్రివర్గ ప్రమాణ  స్వీకారానికి కేసీఆర్ హాజరుకాలేదు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పాలుపంచుకుంటున్న ఆ మీటింగ్ కు హాజరైతే తప్పుడు సంకేతాలు వెలుతాయని ముందురోజే కలిసి వచ్చారు. అలా కాంగ్రెస్ తో వైరాన్ని.. దూరాన్ని కొనసాగిస్తున్నారు.

ఇప్పుడు తీవ్రంగా తిట్టిన మోడీని కేసీఆర్ ఎలా ఫేస్ చేస్తారని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ భేటిని కేసీఆర్ - మోడీ చాలా లైట్ తీసుకుంటున్నట్టు టీఆర్ ఎస్ ముఖ్యులు చెబుతున్నారు. స్వతహాగా కేసీఆర్ కు కాంగ్రెస్ తో కలవడం కంటే బీజేపీనే బెటర్ అనే ఫీలింగ్ ఉందట. బీజేపీపై వ్యతిరేకత నేపథ్యంలో ఒకవేళ అటూ ఇటూ అయితే ఫెడరల్ ఫ్రంట్ లో కేసీఆర్ కీలకమవుతారు. అప్పుడు బీజేపీ - కాంగ్రెస్ లో మద్దతు ఎవరికనే ప్రశ్న ఉదయిస్తే కేసీఆర్ బీజేపీకే అవకాశం ఇస్తాడని వారంటున్నారు. తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కు జాతీయ స్థాయిలో కేసీఆర్ మద్దతు ఇవ్వరని స్పష్టం చేస్తున్నారు.

అసలు ఫెడరల్ ఫ్రంట్ వెనుకాల బీజేపీ కూడా ఉండవచ్చన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. బీజేపీపై వ్యతిరేకతను కాంగ్రెస్ పై మల్లకుండా ప్రాంతీయ పార్టీలకు లాభం కలిగేలా బీజేపేనే కేసీఆర్ సాయంతో ఫెడరల్ ఫ్రంట్ ను ప్రోత్సహిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా మోడీ-కేసీఆర్ భాయి భాయి అని కేవలం వచ్చే ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ఫ్రంట్ డ్రామాలు అంటూ కొట్టిపారేస్తున్నారు. ఏది గుట్టో ఏదీ రట్టో తెలియాలంటే మాత్రం 2019 ఎన్నికల వరకూ అందరూ ఆగాల్సిందే..
Tags:    

Similar News