విగ్రహానికి దండేయలేని అనారోగ్యమా కేసీఆర్

Update: 2015-08-21 04:28 GMT
రాజకీయ నాయకులు.. అందునా కీలకస్థానాల్లో ఉన్న వ్యక్తులు తాము చేసే పనుల విషయంలో చాలానే జాగ్రత్తలు తీసుకుంటారు. తాము చేసే పనుల విషయంలో ఏదైనా వివాదం రేగే అవకాశం ఉందని భావిస్తే.. అలాంటివి చోటు చేసుకోకుండా జాగ్రత్త పడుతుంటారు. కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రూట్ కాస్తంత సపరేట్.

తాను ఏం అనుకున్నారో అదే చేస్తారే తప్పించి.. ఎవరో ఏదో అనుకుంటారని అస్సలు పట్టించుకోరు. మొండితనంతో పాటు.. ఇలానే ఎందుకు చేయాలన్న తిరుగుబాటు ధోరణి కూడా కనిపిస్తుందని ఆయన్ని సన్నిహితంగా చూసిన వారు ఆయన గురించి వ్యాఖ్యానిస్తుంటారు. తాజాగా చోటు చేసుకున్న ఒక పరిణామం చూస్తే.. ఈ వాదనలో నిజం ఉందనిపించటం ఖాయం.

గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ఉధృతంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం.. తన ఫాంహౌస్ ఉండే ఎర్రపల్లి గ్రామంలో పర్యటించారు. ఎక్కడో కాదు.. ముందు తన ఫాంహౌస్ ఉన్న కాడి ఊరు సంగతేందో చూడాలనిపించిన కేసీఆర్.. తనతో మంత్రులు.. పెద్దాఫీసర్లు ఎవరూ వెంట రావొద్దని గట్టిగా చెప్పేసి.. అధికారులు తోలుకుపోయే రూట్ లో కాకుండా తనకు నచ్చిన రూట్లో పోయి.. వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రయత్నించారు.

ఎర్రపల్లి గ్రామంలో పాదయాత్ర చేసే క్రమంలో.. షెడ్యూల్ ప్రకారం అంబేడ్కర్ విగ్రహానికి పూలదండ వేయాల్సి ఉంది. ఈ కార్యక్రమం కోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఊరంతా తిరుగుతూ వస్తున్న కేసీఆర్.. అంబేడ్కర్ విగ్రహం దగ్గర పూలదండ వేయాల్సి ఉన్నా వేయలేదు. స్థానిక సర్పంచ్ చేత ఆయన పూలదండ వేయించారు.

తనకు ఆరోగ్యం బాగాలేదని.. అందుకే మెట్లు ఎక్కిపోయి  అంబేడ్కర్ విగ్రహానికి పూలదండ వేయలేకపోయా అని ముఖ్యమంత్రి కేసీఆరే తర్వాత స్వయంగా చెప్పుకోవటం గమనార్హం. మహనీయుల విగ్రహాలకు పూలదండ వేసే విషయంలో జాగ్రత్తలు తీసుకునే నేతలకు భిన్నంగా కేసీఆర్ వ్యవహరించటం ఒక విశేషం అయితే.. ఆ విషయాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పటం మరో అంశంగా చెప్పాలి. అయినా.. నాలుగు మెట్లు ఎక్కి  అంబేడ్కర్ విగ్రహానికి పూలదండ వేయలేనంత అనారోగ్యం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. మరీ.. అంత అనారోగ్యంగా ఉంటే.. గ్రామజ్యోతి కార్యక్రమం అంటూ ఊళ్లకు.. ఊళ్లు తిరగటం కన్నా ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చుగా..?
Tags:    

Similar News