నేత‌ల అతిపై ఒక చూపు చూడండి కేసీఆర్‌

Update: 2017-07-13 05:56 GMT
దేశంలో మ‌రెక్క‌డా లేని విధంగా మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం షి టీమ్‌లు ఏర్పాటు చేసిన వైనాన్ని చాలా గొప్ప‌గా చెప్పుకుంటుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. మహిళ‌ల భ‌ద్ర‌త‌కు తాను అమితంగా ప్ర‌యారిటీ ఇస్తాన‌న్న మాట‌ను మాట‌ల్లోనే కాదు.. చేత‌ల్లోనూ చేసి చూపిస్తుంటారు కేసీఆర్‌. మ‌హిళ‌ల భ‌ద్ర‌త మీద ముఖ్య‌మంత్రి క‌మిట్ మెంట్ ను శంకించాల్సిన అవ‌స‌ర‌మే లేదు. కాకుంటే.. ప‌వ‌ర్ త‌ల‌కు ఎక్కిన తెలంగాణ అధికార‌ప‌క్ష నేత‌లు త‌మ అధినేత తీరుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తూ ప్ర‌భుత్వానికి.. అధికార‌పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు.

ఏదైనా జ‌రిగిన వెంట‌నే సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. ఇలాంటివి జ‌రిగితే ఊరుకునేది లేద‌నే విష‌యాన్ని స్ప‌ష్టంగా చెప్పేయ‌ట‌మే కాదు.. సీఎంవో ద్వారా ట్విట్స్ చేస్తూ.. త‌ప్పుల విష‌యంలో తానెంత క‌రుకుగా ఉంటాన‌న్న విష‌యాన్ని చేత‌ల‌తో చెప్పేస్తున్నారు.

అయితే.. ఇటీవ‌ల కాలంలో అధికార పార్టీ నేత‌ల తీరుపై త‌ర‌చూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. త‌ప్పు జ‌రిగిన‌ప్పుడు స్పందించే క‌న్నా.. త‌ప్పు జ‌ర‌గ‌టానికి అవ‌కాశం ఉన్న వారి విష‌యంలో అలెర్ట్ గా ఉండ‌టం ద్వారా అతి చేసే ప్ర‌జాప్ర‌తినిధుల జోరుకు కంట్రోల్ చేయొచ్చంటున్నారు.

హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో అంద‌రి ఎదుట క‌లెక్ట‌ర్ చేతిని ప‌ట్టుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే  బానోత్ శంక‌ర్ నాయ‌క్ తీరు అధికార‌ప‌క్షానికి చెడ్డ‌పేరును తీసుకొచ్చింది. త‌ప్పు చేసిన ఎమ్మెల్యేపై సీఎం మండిప‌డట‌మే కాదు.. సారీ చెప్పించిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వానికి జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. ఒక జిల్లా క‌లెక్ట‌ర్ స్థాయిలో ఉన్న మ‌హిళ మీద ఒక అధికార‌పార్టీ ఎమ్మెల్యే అనుచితంగా వ్య‌వ‌హ‌రించ‌టం ఏమిట‌న్న చ‌ర్చ మొద‌లైంది.

ఇలాంటి ఘ‌ట‌న ఈ మ‌ధ్య‌న ఇదే తొలిసారి కాదంటున్నారు. మ‌హిళా అధికారుల‌పై అధికార‌ప‌క్ష నేత‌లు దురుసుగా వ్య‌వ‌హ‌రిస్తున్న వైనం ఈ మ‌ధ్య‌న ఎక్కువ అవుతుంద‌ని చెబుతున్నారు. ఎవ‌రి దాకానో ఎందుకు బానోత్ శంక‌ర్ నాయ‌క్ తీరు అభ్యంత‌ర‌క‌రంగా ఉంటుంద‌ని క‌లెక్ట‌ర్ ప్రీతిమీనా ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. గ‌తంలో ప‌లుమార్లు ఎమ్మెల్యే అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించేవార‌ని.. అమ‌ర్యాద‌గా మాట్లాడేవార‌ని ప‌లువురు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎమ్మెల్యే తీరుపై ప్ర‌భుత్వానికి ఆర్నెల్ల క్రిత‌మే క‌లెక్ట‌ర్ ఫిర్యాదు చేసిన‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. అప్ప‌టి నుంచి ఎలాంటి చ‌ర్య‌లు ఎందుకు తీసుకోలేద‌న్న విమ‌ర్శ‌లు ప్ర‌భుత్వంపై వ‌స్తున్నాయి. ఇప్పుడు అంద‌రి ఎదుట ఘ‌ట‌న జ‌ర‌గ‌టం.. మీడియాలో ప్ర‌ముఖంగా రావ‌టంతో ప్ర‌భుత్వం ఆఘ‌మేఘాల మీద ఇష్యూను క్లోజ్ చేసేలా ప్ర‌య‌త్నించింద‌న్న విమ‌ర్శ‌లు లేక‌పోలేదు.

ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్ గ‌తంలో ఒక భూమి ఇష్యూలో స్థానిక మ‌హిళా త‌హ‌శీల్దార్ ను ఇంటికి పిలిపించి దుర్బాష‌లాడిన‌ట్లుగా చెబుతున్నారు. ఇప్పుడేమో ఏకంగా క‌లెక్ట‌ర్ తోనే అనుచితంగా వ్య‌వ‌హ‌రించటం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే జ‌న‌గాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి సైతం ప్రోటోకాల్ పాటించ‌టం లేదంటే అక్క‌డి మ‌హిళా క‌లెక్ట‌ర్ పై దుందుడుకుగా వ్య‌వ‌హ‌రించిన వైనాన్ని ప‌లువురు గుర్తు చేస్తున్నారు. అధికారపార్టీ ఎమ్మెల్యేల్లో అతిగా వ్య‌వ‌హ‌రించేవారికి సీఎం కేసీఆర్ ముకుతాడు వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News