కేసీఆర్ తో కలిసి భోజనం చేసిన ఆగవ్వకు ఏమైంది?

Update: 2021-06-25 04:59 GMT
తాను దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామానికి వెళ్లటం.. గ్రామస్తులందరికి సామూహిక భోజనాలు పెట్టించటం.. భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించటం.. వరాల జల్లు కురిపించటం లాంటివి దగ్గరుండి చేయించారు ముఖ్యమంత్రి కేసీఆర్. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కనే కూర్చొని భోజనం చేసిన ఆగవ్వ చాలామందిని ఆకర్షించారు.

సీఎం కేసీఆర్ కు పక్కనే కూర్చొని భోజనం చేసిన ఆగవ్వ అస్వస్థత కావటం వార్తాంశంగా మారింది. దీనికి కారణం.. సీఎం సభలో భోజనం చేసి.. ఇంటికి వెళ్లిన తర్వాత ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దీంతో ఆమెను భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. తాజాగా ఆమెను ఇంటికి పంపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగుందని చెప్పారు. కడుపు నొప్పి ఇబ్బంది పోయిందని వైద్యులు తెలిపారు.

ఎండలో తిరగటంతో ఆమె ఆస్వస్థతకు గురైనట్లుగా వైద్యులు చెబుతున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ నిర్వహించిన సామూహిక భోజనాల కార్యక్రమంలో భోజనాలు చేసిన వారిలో దాదాపు ఇరవై మందికి పైనే అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నారు. ఫుడ్ పాయిజనింగ్ జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే.. భారీ సంఖ్యలో అస్వస్థతకు గురవుతారే తప్పించి.. ఇలా ఇరవై మందికి మాత్రమే అస్వస్థతకు గురయ్యే వీల్లేదంటున్నారు. మొత్తంగా ఆగవ్వ పరిస్థితి ఇప్పటికైతే మెరుగుపడిందని చెబుతున్నారు.



Tags:    

Similar News