‘నేను కష్టపడి తెలంగాణ తెచ్చాను’.. ఈ మాటలే కేసీఆర్ తగ్గించుకోవాలా?

Update: 2021-11-08 05:58 GMT
ఉద్యమ వేళలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొన్ని సూత్రీకరణలు చేసేవారు. అందులో ముఖ్యమైనది తెలంగాణ ప్రజలు వేరు ఏపీ ప్రజలు వేరు అని. యాస మాత్రమే కాదు అలవాట్లు వేరుగా ఉంటాయని చెప్పేవారు. నిజమే.. మిగిలిన వాటికి సంబంధించి ఏం ఉన్నా లేకున్నా.. భావోద్వేగాల విషయంలో మాత్రం భూమి.. ఆకాశానికి మధ్యనున్నంత దూరం ఈ రెండు ప్రాంతాల ప్రజల మధ్య ఉందన్న విషయం మాత్రం నిజం. మరి.. ఈ విషయాన్ని కేసీఆర్ గుర్తించారో లేదో? హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు.

ప్రధానమంత్రి మోడీ మొదలుకొని బండి సంజయ్ వరకు.. రాష్ట్రంలోని విపక్షాలపైనా ఆయన దూంధాం అన్న రీతిలో చెలరేగిపోయారు. తమను విమర్శించే వారి నోళ్లను మూయించేందుకు ఆయన కన్నెర్ర చేయటమే కాదు.. నోటికి వచ్చినట్లుగా మాటలు అనేసే వారి నాలుక చీలుస్తానన్న ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా చూసినప్పుడు తాను కోరుకున్న రీతిలో తెలంగాణ ప్రజలు తీర్పు ఇవ్వలేదన్న కోపం ఆయనలో కొట్టొచ్చినట్లుగా కనిపించింది. ఇంతకాలం బండి సంజయ్ స్థాయి తనకే మాత్రం సూట్ కాదన్న ఉద్దేశంతో మౌనంగా ఉన్నానని.. అతడి మాటల్ని పట్టించుకోలేదన్న కేసీఆర్.. తాజాగా మాత్రం స్థాయి బేధాల్ని వదిలేసి.. బండిపై తీవ్రంగా మండిపడటం గమనార్హం.

ఎప్పటిలానే సుదీర్ఘంగా సాగిన కేసీఆర్ ప్రెస్ మీట్ లో పలు అంశాల్ని ప్రస్తావించారు. అవన్నీ ఒక ఎత్తు.. కొన్ని మాటలు మరో ఎత్తు. అలాంటి మాటల్లో ఒకటి.. ‘నేను కష్టపడి తెలంగాణ తెచ్చాను. అల్లాటప్పాగాళ్లు దాన్ని ఆగం చేస్తుంటే ఊరుకోను’ అని. దాదాపు ఏడున్నరేళ్లకు పైగా అధికారంలో ఉన్న కేసీఆర్.. తెలంగాణ మూలాల్ని మర్చిపోతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ జాతిపితగా శాశ్విత పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకోవాల్సిన ఆయన..రాజకీయం అన్న ఛట్రంలో ఇరుక్కుపోతున్నట్లుగా కనిపిస్తోంది.

తెలంగాణ రాష్ట్ర సాధన ఎవరి పుణ్యం అన్న విషయంలో తెలంగాణ ప్రజలకు కచ్ఛితమైన అభిప్రాయాలు ఉన్నాయి. వారికి ఒకరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలంతా సమిష్టిగా ముందుకు ఊరకకపోతే.. కేసీఆర్ లాంటి వారు వంద మంది ఉన్నా తెలంగాణ వచ్చేది కాదు. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా నాలుగో తరగతి ఉద్యోగి మొదలు శాఖాధిపతి వరకు అందరూ తెలంగాణను కాంక్షించిన వారే. అన్నింటికి మించి.. తెలంగాణ సాధన కోసం తమ ప్రాణాల్ని పణంగా పెట్టిన వందలాది మంది ఉన్నారు.

ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవాలంటే.. తెలంగాణ ఉద్యమ సమయంలో యువకులు ప్రాణత్యాగం చేయకుంటే తెలంగాణ సిద్ధించేదా? అన్నది అసలు ప్రశ్న. పిట్టలు రాలిపోయిన చందంగా.. ఎవరికి వారు వారి వారిస్థాయిల్లో తాము కోరుకున్న తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారు. తెలంగాణ ప్రజానీకం మొత్తం ఒక తాటి మీద వచ్చేందుకు వారు చాలానే చేశారు. అలాంటి వారి ప్రాణత్యాగం తెలంగాణ ప్రజల్లో మంట పుట్టేలాచేసి.. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించే వరకు వెనక్కి తగ్గకుండా చేసింది. ఇవన్నీ చారిత్రక సత్యాలు. అంతేకాదు.. ఇవేమీ వందల ఏళ్ల క్రితం జరిగినవి కావు. పదేళ్ల క్రితమే. అంటే.. తెలంగాణలో ఇప్పుడు జీవించి ఉన్న అందరికి (ఐదారేళ్ల వయసు ఉన్న వారికి తప్పించి) అవగాహన ఉన్న విషయాలే.

అందరికి అవగాహన ఉన్న అంశాల మీద మాట్లాడే వేళలో ఆచితూచి అన్నది చాలా ముఖ్యం. కాస్త తేడాగా మాట్లాడినా మొదటికే మోసపోయే పరిస్థితి. తాజాగా కేసీఆర్ మాటల్ని చూస్తే.. తెలంగాణ ఏర్పాటు తన వల్లే అంటూ మొత్తం క్రెడిట్ తీసుకోవటం సబబు కాదు. ఒకవేళ యావత్ తెలంగాణ ప్రజానీకం ఆయనకు క్రెడిట్ ఇవ్వొచ్చు కానీ ఆయనకు ఆయన మాత్రం తీసుకోకూడదు. ఈ చిన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోతున్నారు. ఫలానా సాధించామని ఎవరికి వారు తమ గొప్పను తాము చెప్పుకుంటే ఏం బాగుంటుంది? ఆ గొప్పతనం ప్రజలు చెప్పాలి.

మరి.. ఈ విషయాన్ని కేసీఆర్ మర్చిపోతే ఎలా? తాను కష్టపడి తెలంగాణ తెచ్చానన్న ఆయన మాటలో అహంకారం.. అంతకు మించిన అధికార దర్పం కనిపిస్తోందన్న విషయాన్ని గుర్తించకపోతే అందుకు ఆయన భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే.. ఏపీ ప్రజలు అధికారంలో ఉన్న వారి అహంకారాన్ని పెద్ద విషయంగా భావించరు. కానీ.. తెలంగాణ ప్రజలకు మాత్రం చాలా పెద్ద తప్పు. ఇంకే తప్పునైనా క్షమిస్తారు కానీ.. పాలకుల్లో అహంకారాన్ని మాత్రం తెలంగాణ ప్రజలు సహించరు. తెలంగాణలోని ప్రతి మూలను శోధించినట్లుగా చెప్పుకునే కేసీఆర్.. తన మాటల్లో అహంకారం ఉట్టిపడటం ప్రజలకు నచ్చదన్న ప్రాధమిక విషయాన్ని ఎలా మిస్ అవుతున్నారు?


Tags:    

Similar News