ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ కాకున్నా మంత్రి అవుతాడంట

Update: 2015-04-12 06:03 GMT
ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే కాదు. కనీసం ఎమ్మెల్సీ కూడా కాదు. కానీ.. ఆయన ఆశ చూసినప్పుడు మాత్రం ఆశ్చర్యం కలగక మానదు. పదవి లేకున్నా ఆయన ఫీల్‌ అవుతున్న తీరు చూసినప్పుడు కాస్తంత విస్మయం కలగటం ఖాయం.

ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్‌ వ్యవహారాల్ని కర్నూలు జిల్లాలో ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. అన్న మాదిరి కాకుండా కాస్తంత దూకుడుగా వ్యవహరించే ఆయన గతంలో మంత్రిగా వ్యవహరించారు. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఏపీలో తెలుగుదేశం పార్టీ చక్రం తిప్పుతుంటే తాను మాత్రం మాజీ మంత్రి హోదాలోనే ఉండిపోవటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అందరూ పదవుల్ని ఎంజాయ్‌ చేస్తుంటే.. మాజీ మంత్రి హోదాలో ఉన్న తనకు ఆ అదృష్టం ఎప్పుడన్న విషయాన్ని ఆయనకు ఆయనే చెప్పేసుకోవటం ఇక్కడ విశేషం. జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరైన కేఈ ప్రభాకర్‌ తన మనసులోని మాట చెప్పేశారు. తాను త్వరలో మంత్రి అవుతానని వెల్లడించారు.

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇప్పటికే కర్నూలు జిల్లాకు సంబంధించి ఒక బీసీ నేతను ఊప ముఖ్యమంత్రిని చేసేశారు. ఒకే జిల్లాకు సంబంధించి ఒకే కుటుంబానికి రెండు మంత్రి పదవులు ఇవ్వటం సాధ్యమా? అంటే అది అసాధ్యం. ఇకపోతే. కేఈ ప్రభాకర్‌ ఏమైనా ఎమ్మెల్యేనా.. అంటే అదీ లేదు. కనీసం ఎమ్మెల్సీగా  కూడా ఆయన వ్యవహరించటంలేదు.

అలాంటప్పుడు మంత్రి పదవి వరకూ కేఈ ప్రభాకర్‌ ఎలా వెళతారన్నది కోటి రూకల ప్రశ్న. ఆయన మాటలు విన్న వారి మనసుల్లో చాలా ప్రశ్నలు రేగుతుంటే.. ఆయన మాత్రం తాపీగా తాను చెప్పాల్సింది చెప్పేసి.. తన దారిన తాను పోయారు. ఇంతకీ కేఈ ప్రభాకర్‌కు మంత్రి పదవి ఎలా సాధ్యమబ్బా? మంత్రి పదవి గురించి ఇంత ధీమాగా చెప్పుకున్న ఇతగాడికి అంత నమ్మకంగా మాట ఇచ్చింది ఎవరై ఉంటారు..?
Tags:    

Similar News