సీఎం కూతురుకే టోకరా.. ! సైబర్​ నేరగాళ్ల బరితెగింపు..!

Update: 2021-02-09 03:35 GMT
ఇటీవల సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఉన్నత విద్యావంతులు, సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన వాళ్లు కూడా సైబర్​ దొంగల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రివాల్​ కూతురు హర్షిత కేజ్రివాల్​ ఆన్​లైన్​ మోసగాళ్ల చేతిలో మోసపోయింది. రూ. 35 వేలు ఆమె అకౌంట్​ నుంచి కొట్టేశారు సైబర్​ దొంగలు... ఇంతకీ ఏం జరిగిందంటే.. హర్షిత తమ ఇంట్లో ఉన్న ఓ సోఫాను ఓ ప్రముఖ వెబ్​సైట్​లో అమ్మకానికి పెట్టింది.

సదరు వెబ్​ సైట్​ పాత వస్తువులు.. అమ్మడం.. కొనుగోలు చేయడం చేస్తుంది. దీంతో ఈ వెబ్​సైట్​ నుంచి తాను సొఫా కొంటానంటూ హర్షితను సంప్రదించాడు. ఆ తర్వాత  ఆ సోఫా గురించి ఓ ఒప్పందం కుదిరింది. అయితే తాను ముందుగా కొంత డబ్బు పంపిస్తానంటూ హర్షితకు సదరు వ్యక్తి ఓ క్యూఆర్ కోడ్ ను పంపించాడు. బ్యాంకు ఖాతను ధ్రువీకరించుకోవడానికి అంటూ కొంత డబ్బును కూడా పంపించాడు. దీంతో సదరు వ్యక్తి పంపించిన కోడ్​ను హర్షిత స్కాన్​ చేయడంతో ఆమె అకౌంట్​ నుంచి రూ. 20 వేలు డెబిట్​ అయ్యాయి. డబ్బులు డెబిట్​ అయినట్టు ఫోన్లో మెసేజ్​ రావడంతో సదరు వ్యక్తికి హర్షిత ఫోన్​ చేసింది.

 అయితే పొరపాటున అలా జరిగిందని.. ఈ సారి తాను పంపించబోయే కోడ్ ​ను స్కాన్​ చేస్తే ఆ డబ్బు తిరిగి వస్తుందని నమ్మించాడు. దీంతో మరోసారి కోడ్​ను స్కాన్ చేశాడు. ఆ కోడ్​ను స్కాన్​ చేయగా మరో 15 వేలు పోయాయి. ఆ తర్వాత సైబర్​ నేరగాడు ఫోన్​ స్విచ్చాఫ్​ చేసుకున్నాడు. తాను మోసపోయానని గ్రహించిన హర్షిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఇటీవల సైబర్​ నేరాలు పెరగిపోతున్నాయి. మధ్య తరగతి, ఉన్నతవర్గాల ప్రజలనే సైబర్​ నేరగాళ్లు టార్గెట్​ చేసుకుంటున్నారు.
Tags:    

Similar News