భయపెడుతోన్న కరోనా .. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

Update: 2021-07-29 06:46 GMT
కరోనా వైరస్ సెకండ్ వేవ్ జోరు దేశంలో తగ్గుముఖం పట్టినా కూడా కేరళ రాష్ట్రంలో మాత్రం కరోనా మహమ్మారి తన వ్యాప్తిని కొనసాగిస్తూనే ఉంది. కేరళ రాష్ట్రంలో ఇప్పటికి కూడా కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు భారీగానే నమోదు అవుతున్నాయి. గతంలో ఎలాంటి పరిస్థితి ఉందో , ఇప్పుడు అదే పరిస్థితి కంటిన్యూ అవుతోంది. ఈ తరుణంలోనే జూలై 31వ తేదీ, ఆగస్టు 01వ తేదీల్లో సంపూర్ణంగా లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల పెరుగుదలతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా కాస్త కంట్రోల్‌ కి వచ్చినా కేరళను మాత్రం కరోనా ఇంకా వదిలిపెట్టడం లేదు.

దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో రోజువారీగా వందల్లో కరోనా వైరస్ కేసులు, నమోదు అవుతుంటే , కేరళలో మాత్రం నిత్యం 10 వేలకు పైగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీనితో కేరళలో కరోనా వైరస్ పరిస్థితులు చేజారిపోయినట్లు కనిపిస్తున్నాయని ఆరోగ్యరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో కరోనా వెలుగు చూసిన తొలిరోజుల్లో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో కేరళ ఉత్తమ పనితీరు కనబరిచింది. కానీ, ప్రస్తుతం అక్కడి పరిస్థితులు తారుమారయ్యాయి.

దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో వైరస్‌ ఉద్ధృతి అదుపులోకి వచ్చినా, కేరళలో మాత్రం కంట్రోల్‌ కావట్లేదు. బుధవారం ఒక్కరోజే 20 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వైరస్‌ తీవ్రతకు వణికిపోయిన మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో ప్రస్తుతం పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గినా కేరళలో ఇంకా 10 శాతానికిపైగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో సగం ఒక్క కేరళలోనే ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 5 శాతానికన్నా తక్కువగా నమోదవుతున్నా.. కేరళలో మాత్రం గడిచిన ఆరు వారాలుగా 10 నుంచి 12 శాతం రికార్డవుతోంది. నిత్యం 10 నుంచి 15 వేల మందిలో వైరస్‌ బయటపడుతోంది. అయితే, ఆస్పత్రిలో చేరికలు మాత్రం కాస్త తగ్గాయంటున్నారు కేరళ డాక్టర్లు. రాష్ట్రంలో భారీ స్థాయిలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరుపుతుండడంతోనే పాజిటివ్‌ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

జులై 31, ఆగ‌స్టు 1న లాక్‌ డౌన్ విధిస్తున్న‌ట్లు వివ‌రించింది. క‌రోనా కేసుల తీవ్రత దృష్ట్యా లాక్‌ డౌన్ పొడిగింపు లేదా పాక్షికంగా ఆంక్ష‌ల విధింపు పై మ‌ళ్లీ నిర్ణ‌యం తీసుకోనున్నారు. గత కొన్ని రోజులుగా కేర‌ళ‌లో ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందకుపైగా మ‌ర‌ణాలు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి 20 వేలకు పైగా కేసులు న‌మోదవుతున్నాయి. దీంతో కేర‌ళ స‌ర్కారు లాక్‌ డౌన్ విధించాల‌ని ఈ రోజు నిర్ణ‌యం తీసుకుంది. మ‌రోవైపు, కేర‌ళ‌ లో క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం వైద్య బృందాన్ని పంపాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. జాతీయ అంటు వ్యాధుల నియంత్ర‌ణ సంస్థ డైరెక్ట‌ర్ నేతృత్వంలోని ఆరుగురు స‌భ్యుల వైద్య‌ బృందం ఆ రాష్ట్రానికి త్వ‌ర‌లోనే చేరుకుంటుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. క‌రోనాపై పోరులో కేర‌ళ ప్ర‌భుత్వానికి ఈ బృందం స‌హాయ‌ప‌డ‌నుంది.

దేశంలో నిన్న కొత్తగా 43,509 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,15,28,114కు చేరింది. అలాగే, నిన్న 38,465 మంది కోలుకున్నారు. మరణాల విషయానికొస్తే నిన్న 640 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,22,662కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,07,01,612 మంది కోలుకున్నారు. 4,03,840 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.


Tags:    

Similar News