కేశినేని ట్రావెల్స్ మూసివేత‌పై ఉద్యోగుల ధ‌ర్నా

Update: 2017-04-08 09:34 GMT
90 ఏళ్లుగా సాగుతున్న కుటుంబ వ్యాపారాన్ని మూసేస్తూ విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేవినేని నాని తీసుకున్న అనూహ్య నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మారింది. తాత‌ల కాలం నుంచి న‌డుస్తున్న ట్రావెల్స్ వ్యాపారాన్ని ఈ రోజు ఉద‌యం నుంచి మూసివేస్తూ కేశినేని నాని నిర్ణ‌యం తీసుకున్నారు. వాస్త‌వానికి ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్ తో నాని అండ్ కో గొడ‌వ ప‌డిన సంద‌ర్భంగా తాను వ్యాపారాన్ని మూసేస్తాన‌ని చెప్ప‌టం తెలిసిందే. అయితే.. అలా చేయొద్ద‌న్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట‌తో కొద్ది రోజులు కొన‌సాగించి.. తాజాగా వ్యాపారాన్ని క్లోజ్ చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించ‌టంపై ఆ సంస్థ‌లో ప‌ని చేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం ఇవ్వ‌కుండా వ్యాపారాన్ని మూసేసిన కేశినేని నాని నిర్ణ‌యంతో.. ఆ సంస్థ‌లో ప‌ని చేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఉన్న ప‌ళంగా ఉద్యోగాలు ఉద్యోగాలు ఎలా తీసేస్తార‌ని.. జీతాలు కూడా ఇవ్వ‌లేదంటూ నిర‌స‌న‌ల‌కు దిగారు. బెంగ‌ళూరు.. హైద‌రాబాద్ .. విశాఖ‌ప‌ట్నంతో స‌హా ప‌లు ప్రాంతాల్లోని కేశినేని ఆఫీసుల వ‌ద్ద ఉద్యోగులు ధ‌ర్నా చేస్తున్నారు. జీతాలు కూడా ఇవ్వ‌లేద‌ని ఆరోపిస్తున్నారు.

రూల్స్ ప్ర‌కారం.. ట్రావెల్స్‌ను మూసివేస్తున్న ప‌క్షంలో.. వేత‌నంతోపాటు.. త‌మ‌కు న్యాయ‌ప‌ర‌మైన ప‌రిహారాన్ని చెల్లించాల‌ని కేశినేని ఉద్యోగులు కోరుతున్నారు. న‌ష్టాల కార‌ణంగా సంస్థ‌ను మూసివేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. ఇత‌ర రాష్ట్రాల్లో రిజిస్ట్రేష‌న్ చేసిన బ‌స్సుల్ని ఏపీలోకి అనుమ‌తించ‌కూడ‌ద‌న్న డిమాండ్‌ ను తెర మీద‌కు తెచ్చి..  ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్ తో గొడ‌వ ప‌డిన వారం రోజుల‌కే.. నాని త‌న కేశినేని ట్రావెల్స్ ను మూసేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News