జేసీ బ్ర‌ద‌ర్స్.. పోటీ చేసిన మీ కొడుకులు ఎక్క‌డ‌?

Update: 2020-01-20 05:18 GMT
జేసీ దివాక‌ర్ రెడ్డి, ఆయ‌న త‌మ్ముడు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డిలు దొంగ నాట‌కాలు ఆడుతున్నారంటూ మండి ప‌డ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌ - తాడిప‌త్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఎన్నిక‌ల్లో పోటీ చేసిన జేసీ సోద‌రుల కొడుకులు ఇప్పుడు జ‌నం ముందుకు రావ‌డం లేద‌ని, వారిని ఎక్క‌డో దాచి పెట్టి.. జేసీ సోద‌రులు రాజ‌కీయం చేస్తూ ఉన్నార‌ని పెద్దారెడ్డి వ్యాఖ్యానించారు.

ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో జేసీ బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రూ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ని సంగ‌తి తెలిసిందే. అనంత‌పురం నుంచి ఎంపీగా జేసీ దివాక‌ర్ రెడ్డి త‌న‌యుడు జేసీ ప‌వ‌న్ పోటీ చేశారు. తాడిప‌త్రి నుంచి జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి త‌న‌యుడు జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఆ ఇద్ద‌రూ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. చాలా కాలం త‌ర్వాత తాడిప‌త్రిలో జేసీ కుటుంబం ఓడిపోయింది.

జేసీ దివాక‌ర్ రెడ్డి, ప్ర‌భాక‌ర్ రెడ్డిలు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. వారి వార‌సులు రంగంలోకి దిగారు. అయితే  వారిద్ద‌రూ ఓడిపోయారు. ఓడిపోయిన త‌ర్వాత మ‌ళ్లీ దివాక‌ర్ రెడ్డి, ప్ర‌భాక‌ర్ రెడ్డిలు రాజ‌కీయంగా హ‌ల్చ‌ల్ చేస్తూ ఉన్నారు. తాడిప‌త్రి వ్య‌వ‌హారాల‌ను జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి స‌మీక్షిస్తూ ఉండ‌గా, మిగ‌తా రాజ‌కీయాల‌ను
దివాక‌ర్ రెడ్డి చూసుకుంటున్నారు.

ఇక జేసీల వ్యాపార సామ్రాజ్యం కూడా బాగా ఇర‌కాటంలో ప‌డుతూ ఉంది. ఈ నేప‌థ్యంల ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ను కొన్ని సార్లు పొగుడుతూ, మ‌రి కొన్ని సార్లు విమ‌ర్శిస్తూ జేసీ దివాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే రాజ‌ధాని అంశంలో కూడా దివాక‌ర్ రెడ్డి మాట్లాడుతున్నారు. క‌డ‌ప‌లో రాజ‌ధాని పెట్టాలంటూ త‌న‌కుతోచిన డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే తాడిప‌త్రినే నిల‌బెట్టుకోలేక‌పోవ‌డంతో దివాక‌ర్ రెడ్డి ఇమేజ్ చాలా వ‌ర‌కూ డ్యామేజ్ అయ్యింది. ఇప్పుడే ఏం మాట్లాడినా ఎవ‌రూ ప‌ట్టించుకునేలా లేరు. ఇలాంటి క్ర‌మంలో పెద్దారెడ్డి తీవ్రంగా కౌంట‌ర్ ఇచ్చారు. ఎన్నిక‌ల్లో పోటీ చేసిన కొడుకుల‌ను దాచి పెట్టి.. మీరిద్ద‌రూ రాజ‌కీయం చేస్తున్నారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. జేసీలు అధికారంలో ఉన్న‌ప్పుడు చేసిన త‌ప్పుల ఫ‌లితంగానే వారిపై  ఇప్పుడు కేసులు న‌మోదు అవుతూ ఉన్నాయ‌ని పెద్దారెడ్డి అన్నారు.
Tags:    

Similar News