ఆ దేశంలో ఆందోళ‌న‌లు ఆ రెండు దేశాల కుట్రేనా?

Update: 2022-10-04 08:03 GMT
హిజాబ్‌కు వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనలతో ఇరాన్ ఇంకా అట్టుడుకుతూనే ఉంది. వేలమంది మహిళలు నిర్భయంగా రోడ్ల మీదకు వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వం పోలీసులతో అణ‌చివేయాల‌ని చూస్తున్నప్ప‌టికి మ‌హిళ‌లు హిజాబ్‌కు వ్య‌తిరేకంగా త‌మ ఆందోళ‌న‌ల‌ను ఉధృతం చేశారు.

హిజాబ్‌ను సరిగ్గా పాటించనందుకు ఆ దేశ పోలీసులు అరెస్టు చేసి కొట్ట‌డంతో 22 ఏళ్ల మహ్సా అమిని అనే యువ‌తి సెప్టెంబ‌ర్ 17న‌ మరణించిన సంగ‌తి తెలిసిందే. దీనికి నిర‌స‌న‌గా ఇరాన్ లో వేలాది మంది మ‌హిళ‌లు త‌మ హిజాబ్‌ల‌ను తీసివేశారు. అంతేకాకుండా డెత్ టు డిక్టేట‌ర్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

హిజాబ్ నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డం ఇరాన్‌లో శిక్షార్హ‌మైన నేరం. ఇదే ఆరోప‌ణ‌ల మీద 22 ఏళ్ల మ‌హ్సా అమినీ అనే కుర్దిష్ యువ‌తిని ఆమె ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్‌ను సంద‌ర్శించిన‌ప్పుడు పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను డిటెన్ష‌న్ వ్యానులోనే తీవ్రంగా కొట్టారు. మూడు రోజులు మ‌ర‌ణంతో పోరాడి ఆ యువ‌త్రి ఆస్ప‌త్రిలో క‌న్నుమూసింద‌ని తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. దీంతో మ‌హిళ‌లు త‌మ హిజాబ్‌లు తొల‌గించి భారీ నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చారు. దీంతో ఆందోళ‌న‌లు చెల‌రేగాయి.

భద్రతా దళాల అణచివేతలో ఇప్ప‌టికే 22 మంది మ‌హిళ‌లు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయినా స‌రే మ‌హిళ‌లు వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఇరాన్ సుప్రీం లీడ‌ర్ అయ‌తొల్లా అలీ ఖ‌మేనీ నియంత పాల‌న అంత‌మ‌వ్వాల‌ని నినాదాలు చేస్తున్నారు. ఇందుకోసం తెగించి పోరాడుతున్నారు. ఇలా గడిచిన మూడు వారాలుగా ఇరాన్‌లో తీవ్ర ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి.

కాగా ఈ ఆందోళ‌న‌ల‌పై తాజాగా ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేని స్పందించారు. దేశంలో జరుగుతున్న నిర‌స‌న‌ల‌ను ఖండిస్తున్నాన‌న్నారు. అలాగే అమెరికా, ఇజ్రాయెల్‌ల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇరాన్లో గొడ‌వ‌ల‌కు అమెరికా, ఇజ్రాయెల్ కార‌ణ‌మ‌ని మండిప‌డ్డారు. ఈ రెండు దేశాల‌ పథకం ప్రకారమే ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

ఇరాన్‌లో ఆందోళ‌నల‌కు ముఖ్య కార‌ణం అమెరికా, ఇజ్రాయెల్ అని ఖ‌మేనీ ఆరోపించారు. అమెరికా, యూదుల పాల‌కులు, వారి ఉద్యోగుల వ‌ల్లే ఇరాన్‌లో ఆందోళ‌న‌లు, నిర‌స‌న చెల‌రేగుతోంద‌ని మండిప‌డ్డారు.

టెహ్రాన్‌లోని పోలీస్‌ అకాడమీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో అయ‌తొల్లా అలీ ఖ‌మేని పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైన 22 ఏళ్ల మ‌హ్సా అమీని మృతిని ప్రస్తావించారు. ఆ ఘటన తమనెంతో కలచివేసిందన్నారు. అయితే ప్ర‌స్తుతం జ‌రుగుతున్న నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌ల‌ను ఆయ‌న ఖండించారు.

మ‌రోవైపు ఇప్ప‌టికే ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు ఆగ‌క‌పోవ‌డంతో ఇరాన్ ప్ర‌భుత్వం తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేస్తోంది. నిర‌స‌న‌కారుల‌పై ఉక్కుపాదం మోపుతాన‌ని స్ప‌ష్టం చేసింది. ఈ క్రమంలో హింసాత్మక ఘటనల్లో పాల్గొనే వారికి తీవ్ర శిక్షలు ఉంటాయని ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ తాజాగా హెచ్చరించారు. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్‌ల‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డంతో ఆ రెండు దేశాలు ఎలా స్పందిస్తాయ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News