కేసీఆర్- ఖమ్మం.. ఆమరణ దీక్ష నుంచి.. బహిరంగ సభ దాకా

Update: 2023-01-10 07:10 GMT
''ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమ ప్రభావం ఏది..? అసలు ఖమ్మం తెలంగాణలో ఉందా...'' ఓ పన్నెండేళ్ల కిందట తనను కలిసిన నాయకులతో నాటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివి. అలాంటి ఖమ్మం.. ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటుకు గుమ్మంగా మారింది. 2009 నవంబరు 29న కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్దేశంలో సిద్దిపేటలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష.. తదనంతర పరిణామాల్లో ఆయనను ఖమ్మం తరలించడం.. అక్కడ దీక్ష విరమణ ప్రయత్నాలతో ఉవ్వెత్తున ఉద్యమం ఎగియడం.. అది మూడేళ్ల పాటు కొనసాగి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు దారితీయడం.. తదితరాలు అంతా చరిత్రే. ఆ విధంగా ఖమ్మంతో కేసీఆర్-తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పరోక్ష అనుబంధం ఏర్పడింది.

నాడు అనూహ్య పరిస్థితుల్లో

2009 ఆఖర్లో ఆమరణ దీక్ష చేపట్టిన కేసీఆర్ ను మంచి వైద్య వసతులుండే హైదరాబాద్ కాకుండా ఖమ్మం తరలించడమే చిత్రం. అక్కడ ఆయన్ను ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచడం, ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్ సమక్షంలో పండ్ల రసం తాగి దీక్ష విరమణ ప్రయత్నాలు చేయడం నాడు మీడియాలో హల్ చల్ చేసి ఉద్యమ కాకను రేపాయి. అదే సమయంలో ఎల్బీ నగర్ లో శ్రీకాంతాచారి బలిదానం ఉద్యమానికి ఊపిరులూదింది. ఇక కేసీఆర్ ఖమ్మం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి నిమ్స్ లో చేరారు. ఉద్యమం అలాఅలా పతాక స్థాయికి వెళ్లిపోయింది.

అధికారంలోకి వచ్చాక..

తెలంగాణ ఏర్పాటై టీఆర్ఎస్ సర్కారు కొలువుదీరినా.. అధికార పార్టీకి ఖమ్మం జిల్లా కొరకరాని కొయ్యగానే మిగిలింది. చాలాకాలం పాటు సమర్థ నాయకత్వం లేని నేపథ్యంలో పరిస్థితులు కలిసివచ్చి తమ్మల నాగేశ్వరరావు వంటి బలమైన నాయకుడు టీఆర్ఎస్ కు లభించాడు. తదనంతర పరిస్థితుల్లో 2014లో ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం టీఆర్ఎస్ లోకి వచ్చేశారు. అలా ఉమ్మడి ఖమ్మంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టీడీపీని కాదని టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగింది.

2018లో అనూహ్యంగా వెనుకబాటు

అనూహ్యంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లి మహా కూటమిని ఎదుర్కొని, 2018లో అఖండ విజయం సాధించిన టీఆర్ఎస్ కు.. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఫలితాలు మాత్రం పూర్తి నిరాశ కలిగించాయి. టార్గెట్ 100కు గండి పడడంలో ఉమ్మడి ఖమ్మం పాత్రే కీలకం కావడంతో అధిష్ఠానం ఆగ్రహానికి గురైంది. తుమ్మల, పొంగులేటి వర్గాల మధ్య విభేదాల కారణంగానే ఒక్క సీటుకు పరిమితం అయ్యామనే నిర్ధారణకు వచ్చి వారిద్దరినీ దూరం పెట్టింది. ఇప్పుడు వీరిలో పొంగులేటి బీజేపీలోకి వెళ్లడం ఖాయమైంది. తుమ్మల కూడా టీడీపీలోకి వెళ్తారని ప్రచారం జరిగినా అదేమీ వాస్తవం కాదని తేలిపోయింది.

బీఆర్ఎస్ కు పెద్ద గుమ్మం

బీఆర్ఎస్ తో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న కేసీఆర్ కు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సత్తా చూపాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల కల్చర్ సమ్మిళితమై ఉండే ఖమ్మం కీలకంగా మారింది. అందులోనూ వర్గ రాజకీయాలతో పార్టీ వెనుకబడిన, పట్టున్న నేతలు వెళ్లిపోతారనే ప్రచారం జరుగుతున్న ఖమ్మంలో బీఆర్ఎస్ దమ్మేంటో చూపాల్సిన పరిస్థితి వచ్చింది.

ఈ నేపథ్యంలోనే ఖమ్మంలో ఈ నెల 18న నాలుగు లక్షల మందితో భారీ సభ తలపెట్టారు. ముగ్గురు సీఎంలను ఆహ్వానించారు. ఇదే సభలో బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించనుంది? ఆ పార్టీ విధానాలు ఏమిటి? అనే వివరాలను కేసీఆర్ స్పష్టం చేయనున్నారు. అంటే.. 2009లో కేసీఆర్ మలి దశ ఉద్యమానికి, నేటి జాతీయ రాజకీయ ప్రస్థానానికి నాంది, పునాది ఖమ్మం కానుంది.  



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News