జగన్ చెవిన పడాలని.. గొంతు పెంచుతున్నారే... ?

Update: 2022-01-08 03:30 GMT
అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజెస్ ఎన్ని ఉంటాయో ఇబ్బందులూ అన్నే ఉంటాయి. చాలానే పదవులు ఉంటాయి. వాటి కోసం ఎదురుచూసే జనాలూ ఎక్కువగానే ఉంటారు. ఇపుడు ఇదంతా ఎందుకు అంటే రాజ్యసభ సీట్ల కోసమే.   ఏపీలో ఈ ఏడాది జూన్ లో నాలుగు సీట్లు  ఖాళీ అవుతున్నాయి. అందులో వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి ఉంటే బీజేపీ నుంచి సురేష్ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ ఉన్నారు.

రాజ్యసభకు నెగ్గాలి అంటే కచ్చితంగా 42 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. టీడీపీకి ఆ సంఖ్యాబలం లేదు కాబట్టి నాలుగూ వైసీపీ ఖాతాలోనే పడతాయి. ఇందులో విజయసాయిరెడ్డి మరో మారు ఎంపీ కావడం ఖాయం. మిగిలిన మూడింటి మీద చాలా మంది కన్ను ఉంది. ఇక ఉత్తరాంధ్రా విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి ఉన్నారు. ఆమె రాజ్యసభ సీటు హామీతోనే 2019 ఎన్నికల ముందు పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.

నిజానికి ఆమెను వైఎస్సార్ రాజకీయాల్లోకి తెచ్చారు. 2004 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఎంపీగా పోటీ చేసి ముప్పయి వేల ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు. 2009 ఎన్నికల్లో మాత్రం ఆమె దాదాపు ఎనభై వేల ఓట్ల తేడాతో ఎర్రన్నాయుడిని ఓడించేశారు. ఆ దఫా ఆమె కేంద్రంలో టెలి కమ్యునికేషన్స్ మంత్రిగా పనిచేశారు. ఇక 2014 ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే కేవలం 24 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఆనాడే ఆమెను వైసీపీలోకి జగన్ ఆహ్వానించినా ఆమె కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. ఇక 2019 ఎన్నికల ముందు మాత్రం ఆమె వైసీపీలో చేరి టెక్కలి అసెంబ్లీ సీటు కోరారు. అయితే జగన్ అప్పటికే దాన్ని పేరాడ తిలక్ కి కన్ ఫర్మ్ చేశారు. దాంతో రాజ్యసభ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. అలా ఆమె పెద్దల సభలో ప్లేస్ కోసం గత మూడేళ్ళుగా ఎదురుచూస్తున్నారు.

ఈ దఫా ఖాళీ అయ్యే సీట్లలో ఒకటి ఉత్తరాంధ్రా బీసీ మహిళగా కిల్లి కృపారాణికి ఇస్తారని ప్రచారం సాగుతోంది.  వృత్తి రిత్యా వైద్యురాలిగా, ప్రవృత్తి రిత్యా సామాజిక సేవకురాలిగా ఉన్న కృపారాణి పార్లమెంట్ లోనే అడుగుపెట్టాలనుకుంటున్నారు.  బలమైన కాళింగ సామాజికవర్గానికి చెందిన ఆమెను రాజ్యసభకు పంపిస్తే సామాజికవర్గం పరంగా, రాజకీయంగా కూడా కూడా కలసివస్తుందని జగన్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక రాజ్యసభలో గట్టిగా మాట్లాడే గొంతుగా కృపారాణి ఉంటారని అంచనా వేస్తున్నారు.

అయితే అనేక రకాలైన సమీకరణలు తెర ముందుకు వస్తున్నాయి. చాలా మంది బిగ్ షాట్స్ కూడా రేసులో ఉంటున్నారు. దాంతో కిల్లి కృపారాణికి హామీ ఇచ్చినా చివరి నిముషం వరకూ ఏమీ చెప్పలేరని అన్న వారూ ఉన్నారు.  ఎందుకైనా మంచిదని ఈ మహిళా నేత గొంతు ఒక్కసారిగా పెంచేశారు. జగన్ సర్కార్ సంక్షేమం దేశానికే ఆదర్శమని ఆమె లేటెస్టుగా  భారీ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. ఏపీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో దేశంలోనే మంచి నంబర్ లో ఉందని కూడా కితాబు ఇస్తున్నారు.

మరి కిల్లి మాటలు జగన్ చెవిన పడతాయా. ఆమెకు రాజ్యసభ సీటు గ్యారంటీయా అంటే చూడాలి మరి. అయితే ఆమెను వచ్చే ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేయించాలన్న ఆలోచన కూడా ఉందని అంటున్నారు. మరో వైపు ఇప్పటికే కాళింగ సామాజిక వర్గానికి చెందిన వారికి బాగానే ప్రాధాన్యత ఇచ్చినందువల్ల కిల్లికి చాన్స్ దక్కుతుందా అన్నది కూడా చర్చగా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News