కేంద్ర మాజీ మంత్రికి షాకిస్తారా... ?

Update: 2022-01-21 23:30 GMT
ఆమె దివంగత నేత వైఎస్సార్ పొలిటికల్  డిస్కవరీ. ఆయనే ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరీ ఎంపీ టికెట్ ఇచ్చారు. డాక్టర్ ప్రొఫెషన్ లో ఉంటూ జనాలకు బాగా తెలిసిన ఆమెను ఆమె  ఆదరణను చూసి వైఎస్సార్ 2004లో అప్పటి సిట్టింగ్ టీడీపీ ఎంపీ ఎర్రన్నాయుడు మీద పోటీకి పెట్టారు. తొలి ప్రయత్నంలో ఆమె నెగ్గకపోయినా 2009 ఎన్నికల్లో మాత్రం గెలిచారు. తొలిసారిగా ఎర్రన్నాయుడుని మాజీని చేశారు. ఇక ఆ తరువాత లక్ కలిసొచ్చి యూపీయే సర్కార్ లో కేంద్ర మంత్రి అయ్యారు.

సీన్ కట్ చేస్తే 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. కానీ ఎమ్మెల్యే కాలేకపోయారు. గత మూడేళ్ల వైసీపీ ఏలుబడిలో ఆమెకు ఏ నామినేటెడ్ పదవి కూడా దక్కలేదు. జగన్ మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికే పదవులు పంచుతూ వస్తున్నారు. ఇక ఆమె ఆశలన్నీ రాజ్యసభ సీటు మీద పెట్టుకున్నారు.  అయితే ఇపుడు ఆ ఆశలు అడియాశలు అయ్యేటట్టుగా ఉంది అంటున్నారు.

ఎందుకంటే ఆమెకు ప్రధానంగా మైనస్ సామాజికవర్గం అవుతోందిట. ఇప్పటికే ఈ సామాజికవర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ కి ఎమ్మెల్సీ ఇచ్చారు. అలాగే శ్రీకాకుళం జిల్లాకే మరో ఎమ్మెల్సీ లేటెస్ట్ గా పాలవలస విక్రాంత్ కి ఇచ్చారు. స్పీకర్ తో పాటు ఉప ముఖ్యమంత్రి, రెండవ మంత్రి పదవి ఇదే జిల్లాకు లభించాయి. దాంతో ఏ విధంగా చూసుకున్నా ఈసారి ఈ జిల్లాకు చాన్స్ లేదు అంటున్నారు.

మరో వైపు చూస్తే ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు ఉంటే అందులో కచ్చితంగా విజయసాయిరెడ్డికి ఒకటి రెన్యూవల్ అవుతుంది. అంటే ఉత్తరాంధ్రా కోటాలోనే ఆయనకు ఇస్తారు. దాంతో శ్రీకాకుళానికి మరోటి  ఇవ్వాలి అన్న ప్రసక్తి ఉండదు అంటున్నారు. ఇక వైసీపీలో  బీసీ వర్గానికి చెందిన ఆశావహులు ఎక్కువగా ఉండడంతో కిల్లి కృపారాణికి ఆ కోటాలో కూడా  చాన్స్ ఇచ్చేది లేదనే చెబుతున్నారు.

పైగా జగన్ ఆమెను 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి లోక్ సభ అభ్యర్ధిగా నిలపాలని చూస్తున్నారు అన్నది లేటెస్ట్ టాక్. ఆమెను పెద్దల సభకు పంపిస్తే ఎంపీ క్యాండిడేట్ ఎవరూ ఉండరు. దాంతో సమర్ధురాలు, కేంద్రంలో మంత్రిగా పనిచేసిన కిల్లిని టీడీపీ ఎంపీ రామ్మోహన్ మీద పోటీకే వినియోగిసారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే తనకు ఇస్తే టెక్కలి ఎమ్మెల్యే టికెట్ లేకపోతే ఎమ్మెల్సీ అయినా రాజ్యసభ సీటు అయినా అని కిల్లి కోరుతున్నారు. కానీ వైసీపీ హై కమాండ్ ఆలోచనలు చూస్తూంటే ఆమె ఆశలకు గట్టి షాక్ తగిలేలా ఉందనే చెప్పాలి. మరి ఆమె లోక్ సభ ఎన్నికలకు ప్రిపేర్ అవుతారా అన్నదే చూడాలి.
Tags:    

Similar News