కిమ్ కీలక నిర్ణయం.. ప్రజల్లో ఆనందం!

Update: 2022-01-03 23:30 GMT
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్.. తనదైన రీతిలో దేశాన్ని పరిపాలించుతూ నిత్యం వార్తల్లో ఉంటారు. శత్రు దేశాలతో పోరుపై హాట్ హాట్ కామెంట్స్ చేసే కిమ్.. ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడారు. ఎన్నడూలేని విధంగా ఆ దేశ అభివృద్ధి, ఆహార సమస్యలపై చర్చించారు. అంతేకాకుండా దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించాలని అక్కడి అధికారులకు సూచించారు. అయితే కిమ్ తాజా ప్రసంగం పట్ల అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ దేశ అధ్యక్షుడు... దేశ సమస్యలపై చాలా సానుకూలంగా మాట్లాడడంతో వారిలో ఆనందం వెల్లివిరిసింది.. మరి కిమ్ లో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి? అనుకుంటున్నారా..!

కరోనా మహమ్మారి పుణ్యమా... అగ్రదేశాలు సైతం ఆర్థికంగా చితికిపోయాయి. వైరస్ ప్రభావంతో అంతర్జాతీయ వాణిజ్య సరఫరా నిలిచిపోయింది. దేశంలోని ఉత్పత్తి రంగం పరిమితంగా పనిచేసింది. చైనా దేశంతో వ్యాపార కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియాలో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడింది. అక్కడి ప్రజలు ఎన్నడూ లేని రీతిలో కరవును ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. వీలైనంత త్వరగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని... ఆహార సమస్యను పరిష్కరించాలని దేశ అధ్యక్షుడికి సూచనలు అందాయి.

విపరీతమైన కరవు ఎదుర్కొంటున్న నేపథ్యంలో... దేశ సమస్యలపై స్పెషల్ ఫోకస్ అవసరమని కిమ్ భావించారు. దేశప్రజలందరికీ సరిపడ ఆహారం అందించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మరోవైపు మహమ్మారిని కట్టడి చేయడానికి ఆరోగ్యశాఖ అధికారులు సైతం కృషి చేయాలని ఆదేశించారు. ఈ కరవు నుంచి బయటపడడానికి అవసరమైతే ప్రభుత్వ కార్యకలాపాల నిధుల్లోను కోతలు విధించిన పర్వేలేదని స్పష్టం చేశారు. అందుకోసం ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖను సైతం ఏర్పాటు చేశారు. ఆహార సమస్య నుంచి సత్వర ఉపశమనం కోసం పనిచేసే విధంగా ఫుడ్ స్టఫ్ శాఖను నియమించారు.

కిమ్ అధికార పగ్గాలు చేపట్టి దాదాపు పదేళ్లు అయింది. కాగా ఇదివరకు కిమ్ ప్రసంగాలు శత్రు దేశాలపై ఆగ్రహావేశాలు వెల్లగక్కేలా ఉండేవి. కానీ ఈ సారి మాత్రం అనూహ్యంగా ఆ దేశ సమస్యలపై ఆయన గళమెత్తారు. ఆయా ప్రాంతాల్లో జరగాల్సిన అభివృద్ధి గురించి మాట్లాడారు. వెనుకబడి ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించాడు. ఇకపోతే 2022 ఏడాదిని గ్రేట్ లైఫ్ అండ్ డెత్ స్ట్రగుల్ గా అభివర్ణించాడు. ప్రభుత్వ అధికారులందరూ కూడా దేశ సమస్యల పరిష్కారం, ఆహార కొరత పరిష్కారంపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. ఇకపోతే ఈ కార్యకలాపాలన్నీ జరుగుతున్నా దేశ రక్షణ విషయంలో ఎటువంటి ఢోకా లేదని స్పష్టం చేశారు. కాగా ఆహార సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో... తక్కువ తినండి అని ఆ దేశ ప్రజలకు కిమ్ ఆదేశాలు జారీ చేశారు. కానీ తాజాగా మాత్రం చాలా సానుకూలంగా స్పందించి... అధికారులను అప్రమత్తం చేశారు. అయితే ఆహార సమస్య తీవ్రమవడం వల్ల కిమ్ లో మార్పు వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. ప్రజల ఆకలి అనేది ఆయనపై చాలా ప్రభావం చూపుతుందని... అందుకే ఈ మేరకు అప్రమత్తమయ్యాడని చెబుతున్నారు.
Tags:    

Similar News