అచ్చెన్నకు అంత సీనుందా ?

Update: 2021-09-17 07:30 GMT
పార్టీ నియమావళికి విరుద్ధంగా వ్యవహరించే నేతలు, క్రమశిక్షణ తప్పిన నేతలపై చర్యలు తీసుకుంటామంటు తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తాజాగా హెచ్చరించారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా విమర్శలు చేసినా, ప్రసార మాధ్యమాల్లో మాట్లాడినా క్రమశిక్షణలు చర్యలు తీసుకుంటామని అచ్చెన్న చెప్పారు. అనంతపురం జిల్లాలో నేతల మధ్య వివాదాలు పెరిగిపోతున్న నేపధ్యంలోనే అచ్చెన్న ఈ హెచ్చరికలు చేసినట్లు అర్ధమవుతోంది.

పార్టీలోని నేతల వైఖరిపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ గెలవదని, కార్యకర్తలకు నేతలపై నమ్మకాలు లేవంటు మీడియా ముందే చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. అంతేకాకుండా అనంతపురంలో జరిగిన నేతల సమావేశంలో కాల్వ శ్రీనివాసుల తీరుపైన కూడా విరుచుకుపడ్డారు. దాంతో మరోనేత ప్రభాకర్ చౌదరి మున్సిపల్ ఛైర్మన్ పై ఆరోపణలు గుప్పించారు.

ఇలా పరస్పరం ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోయారు. దాంతో మనస్తాపం చెందిన అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కాల్వ తన పదవికి రాజీనామాచేశారు. ఈ విషయం ఇపుడు పార్టీలో హాట్ టాపిక్ గా ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే అచ్చెన్న హెచ్చరికలు జారీచేశారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. హెచ్చరికలతో జేసీ బ్రదర్స్ ను అచ్చెన్న కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబునాయుడునే లెక్కచేయరు. ఇక అచ్చెన్న వార్నింగులను పట్టించుకుంటారా ?

పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతికి వచ్చిన దగ్గర నుండి చూస్తే ఎవరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పార్టీకి డ్యామేజింగ్ ఎవరు మాట్లాడిని వారిని పిలిపించి మాట్లాడటమే కానీ ఎవరినీ సస్పెండ్ చేయలేదు. చంద్రబాబు మీద అసంతృప్తితో నేతలు పార్టీని వదిలేసి వెళ్ళాల్సిందే కానీ పార్టీ ఎవరిపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే ఏ నేతపైన కూడా చర్యలు తీసుకునేంత ధైర్యం చంద్రబాబుకు లేదు. అలాంటిది ఇపుడు అచ్చెన్న వార్నింగులు ఇవ్వటమే విచిత్రంగా ఉంది.

నిజంగా క్రమశిక్షణ తప్పని నేతలపై చర్యలు తీసుకోవటమే ఖాయమైతే ముందు అచ్చెన్నపైనే యాక్షన్ తీసుకోవాలి. తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక సందర్భంగా పార్టీలోని మద్దతుదారుడుతో మాట్లాడుతు ‘పార్టీ లేదు బొక్కాలేదు’ అని వ్యాఖ్యానించారు. పైగా లోకేష్ ను ఉద్దేశించి ‘వాడే సక్రమంగా ఉంటే పార్టీకి ఇన్ని సమస్యలు ఎందుకు వస్తాయి’ అని చేసిన వ్యాఖ్యల వీడియో అప్పట్లో సంచలనమైంది. అచ్చెన్న వ్యాఖ్యలు పార్టీని బాగా డ్యామేజి చేశాయి.

పార్టీ అధ్యక్షుడిగా ఉండి అచ్చెన్నే అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు చంద్రబాబు ఏమి చర్యలు తీసుకున్నారు ? అచ్చెన్నపై ఎలాంటి వ్యాఖ్యలు తీసుకోలేదు కాబట్టే ఇపుడు జేసీ బ్రదర్స్ పైన కూడా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశంలేదు. చంద్రబాబు, లోకేష్ పై డైరెక్టుగా ఆరోపణలు, విమర్శలు చేసిన బుచ్చయ్యచౌదరి మీద కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఒకవేళ ఎవరి మీదైనా అచ్చెన్న యాక్షన్ తీసుకోవాలని అనుకున్నా అందుకు చంద్రబాబు ఒప్పుకోరు. అసలే పార్టీ కష్టకాలంలో ఉంది. ఇలాంటి సమయంలో ఏ నేతపైన యాక్షన్ తీసుకోవాలన్నా సాధ్యంకాదు. కాబట్టి అచ్చెన్నకు అంత సీన్ లేదని అర్ధమైపోతోంది.


Tags:    

Similar News