ఎమ్మెల్యే అవుతాను అంటున్న ఎంపీ గారు... బాబు ఏమంటారు...?

Update: 2023-01-12 15:30 GMT
ఎంపీ అంటే పెద్ద పోస్ట్. సీనియర్ లీడర్స్ అంతా అదే కోరుకుంటారు.  ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్ లో తమ గళం వినిపించాలని చూస్తారు. అయితే చిన్న వయసులోనే రెండు సార్లు ఎంపీగా పనిచేసే అవకాశం శ్రీకాకుళం లోక్ సభ సభ్యుడు కింజరాపు రామ్మోహననాయుడుకు దక్కింది. ఆయన 2014, 2019లలో వరసబెట్టి గెలిచారు. ఆయన తండ్రి దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు ఫస్ట్ టైం 1996లో ఎంపీగా నెగ్గారు. అది లగాయితూ ఆయన 1998, 1999, 2004ల్లో నాలుగు సార్లు ఎంపీగా పదమూడేళ్ళ పాటు నాన్ స్టాప్ గా  పనిచేశారు. 2009లో ఫస్ట్ టైం ఓటమి పాలు అయ్యారు.

అదే  విధంగా కేంద్ర మంత్రిగా కూడా ఎర్రన్నాయుడు పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ఆకస్మిక మరణంతో ఎంట్రీ ఇచ్చిన రామ్మోహన్ నాయుడు ఫస్ట్ అటెంప్ట్ తోనే ఎంపీగా నెగ్గారు. 2019లో జగన్ వేవ్ బలంగా వీచి ఉత్తరాంధ్రలోని అన్ని ఎంపీ సీట్లు వైసీపీ ఖాతాలో పడ్డాయి కానీ శ్రీకాకుళం ఎంపీ మాత్రం సైకిలెక్కేసింది. దానికి కారణం కింజరాపు రామ్మోహన్ ప్రతిభా ప్రావీణ్యం అని చెబుతారు.

ఆయన ఎంపీగా పార్లమెంట్ లో యువగళం వినిపిస్తూ తనదైన శైలిలో రాణించారు. ఆయనకు 2019లోనే ఎమ్మెల్యే కావాలని ఉంది కానీ చంద్రబాబు మాత్రం ఎంపీగానే ఈసారికి పోటీ చేయి అని నచ్చచెప్పారు. ఇపుడు 2024లో మాత్రం తన కోరిక తీర్చుకుంటాను అని   రామ్మోహన్  అంటున్నారు. ఆయన శ్రీకాకుళంలోని నరసన్నపేట నుంచి పోటీ చేయాలని అంతా సిద్ధం చేసుకున్నారు అని అంటున్నారు.

అక్కడ భగ్గు రమణమూర్తి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే   రామ్మోహన్  పోటీ చేస్తే తాను తప్పుకుని మద్దతు ఇస్తానని ఆయన అంటున్నారు. ఆ సీట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వారు ధర్మాన క్రిష్ణ దాస్. ఆయన రెవిన్యూ మంత్రిగా జగన్ తొలి మూడేళ్ళ క్యాబినేట్ లో పనిచేశారు. 2004 నుంచి ఆయన నరసన్న పేట నుంచి గెలుస్తూ వస్తున్నారు. అయితే 2014లో ఆయన ఓటమి చవిచూశారు. 2019లో జగన్ వేవ్ లో ఆయన గెలిచి సత్తా చాటారు.

అయితే వచ్చే ఎన్నికల్లో ధర్మాన క్రిష్ణదాస్ గెలుపు మీద డౌట్లు ఉన్నాయి. పార్టీలో అసమ్మతి ఉంది. పైగా దాసన్న వ్యతిరేక వర్గం బలంగా ఉంది. తనకు టికెట్ ఇవ్వాలనే  దశ దాకా చేరుకుంది. ఇక క్రిష్ణ దాస్ తన కుమారుడికి టికెట్ ఇప్పించుకుని తాను రిటైర్ అవుదామని చూస్తున్నారు. సర్వే నివేదికలు అయితే అక్కడ క్రిష్ణదాస్ కుటుంబానికి టికెట్ ఇస్తే గెలవరు అని చెబుతున్నాయి.

ఈ పరిణామాల నేపధ్యంలో తెలుగుదేశం నుంచి యువ ఎంపీ రామ్మోహన్ బరిలోకి దిగితే కచ్చితంగా గెలవడమే కాదు ఆ ప్రభావం జిల్లా అంతటా ఉంటుంది. ఇదే విషయాన్ని చంద్రబాబుకు రామ్మోహన్ వివరించారు అని అంటున్నారు. ఇక తెలుగుదేశం క్యాడర్ ని కూడా రామ్మోహన్ పూర్తి స్థాయిలో చూసుకోలేకపోతున్నారు. ఎంపీగా ఆయన ఢిల్లీలో ఉండడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. దాంతో ఎమ్మెల్యేగా ఉంటూ రేపు తెలుగుదేశం గెలిస్తే మంత్రిగా కూడా అవకాశాన్ని అందుకోవాలని రామ్మోహన్ ఆలోచిస్తున్నారుట.

తన మనసులో మాటను ఈ ఎంపీ చంద్రబాబు చెవిన వేశారు. మరి చంద్రబాబు ఏమి చెబుతారో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలని అంటున్నారు.  మరో మాట చెప్పాలంటే రామ్మోహన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎంపీ సీటుకు పవర్ ఫుల్ క్యాండిడేట్ ఎవరూ లేరు. దాంతో ఈ యువ నేత కోరికను బాబు మన్నిస్తారా ఓకే చెబుతారా అన్నదే చర్చగా ఉంది మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News