తన తప్పుల నుంచి కేసీఆర్ తెలివిగా తప్పించుకుంటున్నారా?

Update: 2019-09-27 06:30 GMT
కొన్నిసార్లు కొన్ని పదాలకు వచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఇలాంటి సందర్భాల్లో తాము చేసిన తప్పుల్ని తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. తాజాగా అలాంటి ప్రయత్నమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఇటీవల కాలంలో మాంద్యం పేరుతో జరుగుతున్న హడావుడి అంతా ఇంతా కాదు. సరిగ్గా టైం చూసుకొని మరీ.. తాను చేస్తున్న తప్పుల్ని కవర్ చేసేలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్న విమర్శను తెర మీదకు తెచ్చారు కిషన్ రెడ్డి.

ఆర్థిక వ్యవస్థ మందగమనం ఉందని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక క్రమశిక్షణ పాటించటం లేదని విమర్శించారు. ఆర్థిక మాంద్యం ప్రభావం ఎక్కువగా ఉందని చెబుతున్న కేసీఆర్.. తెలంగాణ బడ్జెట్ విషయంలో నేల విడిచి సాము చేస్తుందన్నారు. తెలంగాణ ఆర్థికపరిస్థితి దిగజారిపోవటానికి కారణం ప్రపంచ వ్యాప్తంగా నడుస్తోన్న మాంద్యమేనని చెబుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

ఇలాంటి మాటలు వినేందుకు బాగానే ఉన్నా.. నమ్మేందుకు అనువుగా ఉండవన్న విషయాన్ని కిషన్ రెడ్డి మర్చిపోతున్నారు. ఆర్థిక క్రమశిక్షణ ఒక ప్రభుత్వానికి లేదంటూ భారీ ఆరోపణ చేసే ముందుకు.. అందుకు తగ్గ పలు ఉదాహరణాల్ని.. గణాంకాల్ని ప్రస్తావిస్తే బాగుంటుందే తప్ప.. ఉత్త మాటలు చెబితే సరిపోదు.

మాంద్యాన్ని బూచిగా చూపిస్తూ.. తెలంగాణ ఆర్థిక దుస్థితి ఎంతలా ఉందన్న విషయాన్ని కేసీఆర్ తెలివిగా చెప్పారన్న విమర్శ ఉంది. అలాంటి అంశాలపై మరింత హోంవర్క్ చేసి ఆరోపణాస్త్రాల్ని సంధిస్తే బాగుంటుంది. అంతే తప్పించి.. ప్రెస్ మీట్ పెట్టేసి నాలుగు మాటలు అనేస్తే ఏం లాభమన్న పెదవి విరుపుల్ని కిషన్ రెడ్డి లాంటి నేతలు పరిగణలోకి తీసుకుంటే మంచిది. లేకుంటే.. అంతలా విరుచుకుపడినా ఎలాంటి ప్రయోజనం ఉండదన్న వాస్తవాన్ని ఆయన గుర్తించాలి.


Tags:    

Similar News