రెండో రాజధానిగా హైదరాబాద్.. కిషన్ రెడ్డి క్లారిటీ

Update: 2019-08-21 11:28 GMT
కశ్మీర్ విభజన తర్వాత కేంద్రంలోని బీజేపీ ఫోకస్ దక్షిణాదిపై పడిందని.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేయబోతోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో విస్తృతంగా సాగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీనిపై కసరత్తు చేస్తున్నట్టు కూడా వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఇదే హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి ఈ వ్యవహారంపై స్పందించారు. దేశానికి రెండోరాజధానిగా హైదరాబాద్ ను చేస్తున్నారనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు.

హైదరాబాద్ సనత్ నగర్ లో ఈఎస్ఐ ఆస్పత్రిలో 150 కోట్లతో కొత్త బ్లాక్ నిర్మాణానికి బుధవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన హాట్ కామెంట్స్ చేశారు.

ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మార్పు విషయంపై కూడా  కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు  ఏపీ రాజధాని మార్పు పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని స్పష్టం చేశారు. రాజధాని మార్పు అనే విషయం అసలు కేంద్రం పరిధిలోకి రాదని పేర్కొన్నారు.  అమరావతిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కిషన్ రెడ్డి ఈ మేరకు రాజధాని మార్పు విషయంలో కేంద్రం పాత్ర ఉండదని.. రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని వివరణ ఇచ్చినట్టైంది.

ఇక బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఎవరో తెలియదు అన్న కేటీఆర్ పై కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు. కేటీఆర్ కు ఇంతటి అహంకార పనికిరాదని.. మంచి సంస్కృతి కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ లేదన్న కేటీఆర్.. నిజామాబాద్ లో మీ చెల్లెలు కవిత ఎలా ఓడిపోయిందో చెప్పాలని హితవు పలికారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ పథకం బక్వాస్ పథకం అనడంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎన్ ను ఓడించి బీజేపీని అధికారంలోకి తెస్తామని సవాల్ చేశారు.
    

Tags:    

Similar News