సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా కిష‌న్ రెడ్డి!

Update: 2018-07-23 07:58 GMT
సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తెలంగాణ బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత కిష‌న్ రెడ్డి తీసుకున్నారా? అంటే.. అవున‌న్న మాట వినిపిస్తోంది. ఎంపీగా బ‌రిలోకి దిగాల‌న్న మాట వినిపించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే.. సికింద్రాబాద్ నుంచి కానీ లేదంటే మ‌ల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేయాల‌న్న ఆలోచ‌న‌లో కిష‌న్ రెడ్డి ఉన్న‌ట్లు తెలుస్తోంది.

కార్య‌క‌ర్త స్థానం నుంచి అంచ‌లంచెలుగా ఎదిగిన కిష‌న్ రెడ్డి ఎమ్మెల్యేగా వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్న విష‌యం తెలిసిందే. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న‌కు వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుంద‌ని.. ఆయ‌న గెలుపుపై ప‌లు వాద‌న‌లు వినిపించాయి. అయితే.. వాటిల్లో నిజం లేద‌న్న విష‌యం ఆయ‌న విజ‌యం స్ప‌ష్టం చేసింది. కేంద్రంలో మోడీ స‌ర్కారు విజ‌య‌వంతంగా ప‌ని చేస్తున్న వేళ‌.. తెలంగాణ‌లో బీజేపీకి మంచి అవ‌కాశాలు ఉంటాయ‌న్న ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రాష్ట్రంలో టీఆర్ ఎస్ కు ప్ర‌త్యామ్నాయంగా ఎదిగే అవ‌కాశం బీజేపీకి లేని నేప‌థ్యంలో.. త‌న‌కున్న వ్య‌క్తిగ‌త ఛ‌రిష్మాను జోడించి బీజేపీ ఎంపీగా బ‌రిలోకి దిగితే గెలుపు ప‌క్కా అన్న భావ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. 1999లో కార్వాన్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయ‌న ఎదురుదెబ్బ తిన్నారు. అప్ప‌టి నుంచి అలుపెర‌గ‌కుండా తిరిగిన ఆయ‌న అందుకు త‌గ్గ ఫ‌లితాన్ని త‌ర్వాని ఎన్నిక‌ల్లో పొందారు.

అంబ‌ర్ పేట (పాత హిమాయ‌త్ న‌గ‌ర్ ను కూడా క‌లుపుకుంటే) నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా మూడుసార్లు విజ‌యం సాధించిన కిష‌న్ రెడ్డి 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎంపీగా బ‌రిలోకి దిగాల‌ని.. అదే స‌మ‌యంలో తాను ప్రాతినిధ్యం వ‌హించిన స్థానంలో త‌న భార్యను బ‌రిలోకి దింపితే ప్ర‌యోజ‌నం ఉంటుంద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు.

2004లో పాత హిమాయ‌త్‌ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ త‌ర‌ఫున పోటీ చేసిన ఆయ‌న 2009లో కొత్త‌గా ఏర్ప‌డిన అంబ‌ర్ పేట నుంచి విజ‌యం సాధించారు. 2014లోనూ ఆయ‌న త‌న విజ‌యాన్ని న‌మోదు చేసి హ్యాట్రిక్ సాధించారు. త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా మంచి ప‌ట్టున్న అంబ‌ర్ పేట అసెంబ్లీ నుంచి త‌న స‌తీమ‌ణి కావ్య కిష‌న్ రెడ్డిని బ‌రిలోకి దింపితే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఈ వాద‌న‌కు బ‌లం చేకూరేలా ఇటీవ‌ల కాలంలో ఆమె సామాజిక కార్య‌క్ర‌మాల్లో జోరుగా పాల్గొన‌టాన్ని చూపిస్తున్నారు.  ఇంత‌కాలం ఇంటికే ప‌రిమిత‌మైన ఆమె.. భ‌ర్త ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా..కిష‌న్ రెడ్డి అయ్య‌ప్ప మాల వేసుకున్న సంద‌ర్భంలోనూ బ‌య‌ట‌కు వ‌చ్చే వారు.  ఇందుకు భిన్నంగా ఈ మ‌ధ్య‌న త‌ర‌చూ ఏర్పాటు చేసే సామాజిక కార్య‌క్ర‌మాల్లో ఆమె ప్ర‌ముఖంగా క‌నిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాను రాజ‌కీయ ఉద్దేశంతో సామాజిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌టం లేద‌ని కావ్యా కిష‌న్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. కావ్యా అభ్య‌ర్థిత్వంపై అధినాయ‌క‌త్వం నుంచి ఇంకా ఆమోద‌ముద్ర ప‌డ‌లేద‌ని.. అందుకే ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఒక‌వేళ‌.. కిష‌న్ రెడ్డి స‌న్నిహితులు చెబుతున్న‌ట్లుగా ఆయ‌న ఎంపీగా.. ఆయ‌న స‌తీమ‌ణి ఎమ్మెల్యేగా బ‌రిలోకి దిగితే మాత్రం అదో రాజ‌కీయ సంచ‌ల‌నంగా మార‌టం ఖాయ‌మంటున్నారు.



Tags:    

Similar News