తెలుగు రాష్ట్రాల్లో తెర వెనుక చ‌క్రం తిప్పేది అత‌డేనా?

Update: 2019-07-08 04:53 GMT
కాల మ‌హిమ అంటే ఇలానే ఉంటుంది మ‌రి. మొన్న‌టివ‌ర‌కూ హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలోని అంబ‌ర్ పేట నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమిత‌మైన నేత‌.. ఇప్పుడు దేశం మొత్తం తిర‌గ‌ట‌మే కాదు.. త‌న రాజ‌కీయ జీవితంలో ఎప్పుడూ చేయ‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ల్ని.. కీల‌క ప్ర‌క‌ట‌న‌ల్ని చేస్తున్నారు కిష‌న్ రెడ్డి. ఇదంతా మోడీ పుణ్యంగా చెప్ప‌క త‌ప్ప‌దు. పార్టీ చీఫ్.. మోడీ ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన అమిత్ షా నిర్వ‌హించే శాఖ‌కు స‌హాయ మంత్రిగా ఉండ‌టమంటే మాట‌లు కాదు. షా చెప్పాల్సిన మాట‌ల్ని ఆయ‌న శాఖ‌ స‌హాయ‌మంత్రి అయిన కిష‌న్ రెడ్డికి కొన్ని ప‌నులు అప్ప‌గించిన‌ట్లుగా తెలుస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల మీద ప‌ట్టు ఉండ‌ట‌మే కాదు.. ఉమ్మ‌డి రాష్ట్రంలో పార్టీ అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రించిన కిష‌న్ రెడ్డికి రెండు రాష్ట్రాల్లోని అన్ని పార్టీల నేత‌ల‌తో ప‌రిచ‌యంతో పాటు.. వారి బ‌లాలు.. బ‌ల‌హీన‌త‌లు బాగానే తెలుసు. ఎప్పుడు ఎక్క‌డ ఎవ‌రితో ఎలా వ్య‌వ‌హ‌రించాల‌న్న విష‌యాల‌తో పాటు.. వివాదాల్లో చిక్కుకోకుండా ఉండ‌టం ఎలానో ఆయ‌న‌కు బాగా తెలుసు. అందుకే కిష‌న్ రెడ్డికి రెండు తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ ప‌ని అప్ప‌గించిన‌ట్లుగా చెబుతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార‌ప‌క్షంగా బీజేపీ ఆవిర్భ‌వించాల‌న్న‌ది మోడీషాల క‌ల‌. తెలంగాణ‌లో 2023 నాటికి అధికార‌ప‌క్షంగా అవ‌త‌రించాల‌ని డిసైడ్ అయిన బీజేపీ.. అందుకు త‌గ్గ‌ట్లే వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇదే విష‌యాన్ని ఈ మ‌ధ్య‌న బీజేపీ ముఖ్య‌నేత‌లు త‌ర‌చూ వ్యాఖ్యానిస్తున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌యం త‌నకు పెద్ద సంతోషాన్ని ఇవ్వ‌లేద‌ని.. తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తే అదే త‌న‌కు అస‌లైన ఆనందంగా అమిత్ షా చెప్ప‌టాన్ని చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ప‌వ‌ర్ కోసం బీజేపీ జాతీయాధ్య‌క్షుడు ఎంత ఆత్రుత‌తో ఉన్నారో అర్థ‌మవుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఏం జ‌రుగుతుంద‌న్న విష‌యాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకునేందుకు ప‌లు మార్గాలు పెట్టుకున్న బీజేపీ అధినాయ‌క‌త్వం.. అవ‌న్నీ ఒక ఎత్తు అయితే..వారికి ఏ మాత్రం సంబంధం లేకుండా త‌న గ్రౌండ్ రిపోర్ట్ కూడా ఇవ్వాల‌ని కిష‌న్ రెడ్డికి చెప్పిన‌ట్లుగా చెబుతారు. బ‌ల‌మైన సామాజిక వ‌ర్గానికి చెందిన నేత కావ‌టంతో.. తెలుగు రాష్ట్రాల‌కు చెందిన నేత‌లు కిష‌న్ రెడ్డి ట‌చ్ లోకి వెళ్లే అవ‌కాశం ఉంది.

దీనికి తోడు ఆయ‌న కేంద్ర మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న‌తో అయితే టాస్క్ ను తేలిక‌గా పూర్తి చేయొచ్చ‌న్న మాట వినిపిస్తోంది. మొన్న‌టి వ‌ర‌కూ మామూలుగా ఉన్న కిష‌న్ రెడ్డికి తాజా టాస్క్ అప్ప‌గించ‌టం వెనుక మ‌రో కార‌ణం కూడా ఉందంటున్నారు.

ఉమ్మ‌డి రాష్ట్రంలో దివంగ‌త మ‌హానేత వైఎస్ పై పోరు చేసిన ఒంటి నేత‌గా కిష‌న్ కు పేరుంది. ఈ కార‌ణంతోనే కిష‌న్ ను కేంద్ర‌మంత్రివ‌ర్గంలోకి తీసుకున్నార‌న్న మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. మొత్తంగా చూస్తే తెర‌పైన ఎవ‌రు క‌నిపించినా.. తెర వెనుక మాత్రం కిష‌న్ రెడ్డి హ‌స్తం తెలుగు రాష్ట్రాల రాజ‌కీయంలో ఉంటుంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News