పొగిడే కాలం; ప్రిన్స్ మాటకు మరో నేత ఫిదా

Update: 2015-08-22 10:18 GMT
సినిమాలు ఎన్ని చేసినా.. శ్రీమంతుడి లాంటి సినిమా ఒక్కటి చేస్తే ఎంతబాగుండన్న ఆలోచన కలిగిస్తున్న పరిస్థితి. శ్రీమంతుడు సినిమాతో ప్రిన్స్ మహేష్ బాబు ఇమేజ్ ఏ రేంజ్ కి పెరిగిపోయిందో తెలిసిందే. ఒక సామాజిక అంశాన్ని అందరికి ఆకట్టుకునేలా చెప్పిన తీరు.. ప్రేక్షకులకే కాదు.. సెలబ్రిటీలు.. రాజకీయ నాయకుల మనుసుల్ని కూడా దోచుకుంటుంది.

సినిమాల గురించి పెద్దగా ప్రస్తావించని బడా రాజకీయ నాయకులు సైతం.. శ్రీమంతుడు సినిమాను ప్రస్తావిస్తూ.. మహేష్ ను అభినందించటం తెలిసిందే. తెలంగాణ మంత్రి కేటీఆర్ అయితే.. శ్రీమంతుడు సినిమాను చూసి మహేష్  ను అభినందించటంతో పాటు.. తెలంగాణలోని ఏదైనా ఊరును దత్తత తీసుకోవాలని కోరటం.. వెనువెంటనే మహేష్ అందుకు ఓకే చెప్పేయటం తెలిసిందే. తెలంగాణలో కరవు జిల్లాగా సుపరిచితమైన మహబూబ్ నగర్ లోని ఏదైనా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటానని మహేష్ పేర్కొనటం తెలిసిందే.

తాజాగా.. శ్రీమంతుడు సినిమాను చూసి ప్లాట్ అయిపోయిన నేతలే కాదు.. ప్రిన్స్ దత్తత మాటకు సైతం ఫిదా అయిపోతున్నారు. తాజాగా ప్రిన్స్ మాటకు తెగ ఆనందపడిపోయిన  నేతల్లో.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా చేరిపోయారు. తాజాగా ఆయన మహేష్ బాబు దత్తత మాటకు అభినందనలు తెలిపారు.  తెలంగాణలోని పాలమూరు జిల్లాకు చెందిన గ్రామాన్ని దత్తత తీసుకోవాలనుకుంటున్న శ్రీమంతుడు మహేష్ బాబుకు సిన్సియర్ థ్యాంక్ అండ్ బెస్ట్ విషెస్ అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఒక్క సినిమాతో ఇంతమంది అభిమానాన్ని.. పొగడ్తల్ని సొంతం చేసుకునే ఛాన్స్ ప్రిన్స్ కు మాత్రమే దక్కిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News