టీడీపీపై ఆ `ముద్ర‌` వేస్తున్నారా.. బాబు స్పందించ‌రేం?!

Update: 2022-12-26 14:08 GMT
తాజాగా మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యం గ‌మ‌నిస్తే.. టీడీపీపై హంత‌క పార్టీ అనే ముద్ర వేస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదేమంత తేలిక‌గా వైసీపీ నాయ‌కులు వ్యాఖ్యానించ‌డం లేద‌ని, చాలా వ్యూహాత్మ‌కంగానే వైసీపీ నాయ‌కులు ముందుకుసాగుతున్నార‌ని చెబుతున్నారు. తాజాగా ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్య‌లు.. దీనిని ధ్రువీక‌రిస్తున్నా యని చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్న వైసీపీ ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలిచి తీరాల‌నే ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే.

అయితే, ఈ ల‌క్ష్య సాధ‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు సంక్షేమ ప‌థ‌కాల‌ను, ప్ర‌జ‌ల‌కు పంచుతున్న డ‌బ్బుల‌ను న‌మ్ముకుంది. కానీ, ప్ర‌భుత్వ తీరుపై.. ప్ర‌జ‌ల్లో నానాటికీ వ్య‌తిరేక‌త పెరిగిపోతోంది. పింఛ‌న్ల తొల‌గింపుతో పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త మ‌రింత ముదిరింది. మ‌రోవైపు విజ‌య‌న‌గ‌రం.. బొబ్బిలి స‌భ‌ల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు కు వ‌స్తున్న ప్ర‌జాద‌ర‌ణ స‌హ‌జంగానే వైసీపీని డిఫెన్స్‌లో ప‌డేసింది. దీంతో త‌మ చుట్టూ పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేస్తూనే.. మ‌రోవైపు.. టీడీపీని మాన‌సికంగా కుంగ‌దీసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌నే వాద‌న వినిపిస్తోంది.

ఈ క్ర‌మంలోనే కొడాలి నానిని వ్యూహాత్మ‌కంగా ముందుకు తీసుకువ‌చ్చార‌ని తెలుస్తోంది. మేధావులు సైతం.. కొడాలి నాని చేసిన వ్యాఖ్య‌ల వెనుక చాలా తీవ్ర‌మైన అంత‌రార్థం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. రాష్ట్రంలో ఎంతో మంది నాయ‌కులు ఉన్న‌ప్ప‌టి కీ.. నానిని ముందుకు తీసుకువ‌చ్చి.. టీడీపీ హంతక పార్టీ అనే ముద్ర వేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని అంటున్నారు. నాని తీవ్ర‌స్వ‌రం.. స‌హ‌జంగానే మాస్‌లోకి బ‌లంగా వెళ్తుంది. న‌మ్ముతారా? న‌మ్మ‌రా? అనేది ప‌క్క‌న పెడితే.. ముందుకు చ‌ర్చ‌కు అయితే వ‌స్తుంది. ఇదే వైసీపీకి కావాల్సింది!!

ఒక కుక్క‌ను చంపాలంటే.. పిచ్చికుక్క అని ముద్ర‌వేసే ప్ర‌య‌త్నం చేస్తార‌నే సామెత ఉండ‌నే ఉంది. ఇప్పుడు టీడీపీ విష‌యం లోనూ వైసీపీ ఇదే పంథాను ఎంచుకుంద‌నే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ``వాళ్లే క‌త్తుల‌తో పొడిచేసి.. చంపేసి.. వాళ్లే దండలేసి.. ద‌ణ్ణాలు పెడ‌తారు!`` అని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌, వంగ‌వీటి రంగా ఉదంతాల‌ను ఆయ‌న వివ‌రించా రు. ఇది చాలా వ్యూహాత్మ‌కంగా చేస్తున్న దాడిగా మేధావులు భావిస్తున్నారు.

త‌ద్వారా.. టీడీపీ అంటే ఒక భ‌యాన‌క పార్టీగా ప్ర‌జ‌ల్లో ప్రొజెక్టు చేసి.. ఎన్నిక‌ల‌కు ముందు ల‌బ్ధి పొందాల‌నే వ్యూహం వైసీపీ వేస్తోంద‌ని అంటున్నారు. మ‌రి ఇంత జ‌రుగుతున్నా.. చంద్రబాబు కానీ, ఆయ‌న త‌న‌యుడు లోకేష్ కానీ, ఇత‌ర ముఖ్య కాపు నాయ‌కులు కానీ.. రియాక్ట్ కాక‌పోవ‌డం.. గ‌మ‌నార్హం. ఇలాంటివిష‌యాల్లో మొగ్గ‌లోనే స్పందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని టీడీపీ అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News