ఒకే కారులో నందమూరి హరికృష్ణ, కొడాలి నాని

Update: 2016-04-02 06:21 GMT
ఏపీ రాజకీయాలపై చర్చలకు మరో కొత్త పాయింట్ దొరికింది.  టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బావ - పార్టీ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ వైసీపీలోకి వెళ్తారా.... వైసీపీ నేత - గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీలోకి వస్తారా అన్న చర్చ మొదలైంది. ఇందుకు దారి తీసిన పరిస్థితులు కూడా ఆసక్తికరమే. విజయవాడలో శనివారం ఉదయం నందమూరి హరికృష్ణ, కొడాలి  నానిలు ఒకే కారులో వచ్చి బందరు రోడ్డులో దిగారు. దీంతో ఇక చర్చలే చర్చలు. జనానికి హాట్ హాట్ టాపిక్ దొరికినట్లయింది.
    
విజయవాడలోని బందరు రోడ్డులో కొత్తగా నిర్మించిన వెటర్నిటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హరికృష్ణతో కలిసి కొడాలి నాని వచ్చారు. వారిద్దరూ ఒకే కారులో రావడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. దివంగత నేత ఎన్టీఆర్ కు వీరాభిమానిగా పేరున్న కొడాలి నాని... హరికృష్ణ - జూనియర్ ఎన్టీఆర్ లకు అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడ్డారు. అనంతరం కొడాలి నాని టీడీపీకి రాజీనామ చేసి వైసీపీలో చేరిపోయారు. అసంతృప్తిగా ఉన్నా, హరికృష్ణ టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ కలిసి ఒకే కారులో ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కావడం కొత్త రాజకీయ సమీకరణాల దిశగా చర్చకు తెర తీసింది. టీడీపీ ప్రభుత్వ కార్యక్రమం కావడం... దానికి హరికృష్ణతో కలిసి నాని రావడంతో నాని మళ్లీ టీడీపీలోకి వస్తారా అన్న టాక్ ఒకటి మొదలైంది. అదేసమయంలో హరికృష్ణకు టీడీపీలో ఏమాత్రం ప్రయారిటీ లేకుండా పోయింది కాబట్టి ఆయనే వైసీపీలోకి వెళ్తారా అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నవారూ ఉన్నారు. మొత్తానికి హరికృష్ణ - నానిల కారు ప్రయాణం కొత్త చర్చలకు దారితీసినట్లయింది.
Tags:    

Similar News