కేసీఆర్ కారణంగా రూ.900కోట్ల లాస్?

Update: 2016-02-11 18:06 GMT
తెలంగాణకు కావలి కుక్కలా ఉంటానని టీఆర్ ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. తన మాటకు తగ్గట్లే.. కేసీఆర్ చాలా విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తున్నారని.. కక్కుర్తి పనులకు దూరంగా ఉండటంతో పాటు.. ఎవరైనా కక్కుర్తి పడుతున్నారంటే చాలు.. పిలిపించుకొని మరీ వార్నింగ్ ఇస్తున్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ తీరుతో భయపడుతున్న గులాబీ దళం చాలా జాగ్రత్తగా ఉంటున్నారన్న మాట సర్వత్రా వినిపిస్తోంది.

తన పరపతిని దెబ్బ తీసే అవకాశాన్ని ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్న కేసీఆర్ తీరుపై తాజాగా కొన్ని ఆరోపణలు రావటం గమనార్హం. ఇలా ఆరోపణలు చేసిన బ్యాచ్ లో తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎలాంటి పదవులు చేపట్టకుండా తెలంగాణ రాష్ట్రం గురించి మాత్రమే మాట్లాడే ప్రొఫెసర్ కోదండరాం ఉండటం గమనార్హం.

హైదరాబాద్ లో జరిగిన విద్యుత్తునియంత్రణ మండలి నిర్వహించిన బహిరంగ విచారణకు హాజరైన కోదండరాం.. విద్యుత్ రంగ నిపుణుడు రఘు తదితరులు కేసీఆర్ సర్కారు తీరు పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విమర్శలు చేయటం గమనార్హం. ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు విషయంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు చేసుకున్న ఒప్పందంపై పలు అనుమానాల్ని వ్యక్తం చేయటం విశేషం. ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై చర్చ జరగాలని.. అభ్యంతరాలు స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం ఇవ్వాలంటూ కోదండరాం డిమాండ్ చేయటం గమనార్హం.

మరోవైపు.. విద్యుత్ రంగ నిపుణుడు రఘు మాట్లాడుతూ.. ఛత్తీస్ గఢ్ సర్కారుతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కారణంగా తెలంగాణ ఖజానాకు రూ.900కోట్లు నష్టం వాటిల్లిందంటూ బాంబు పేల్చారు. ఏదో ఆరోపణ చేశామంటే.. చేశామన్నట్లు కాకుండా.. యూనిట్ విద్యుత్ కు ఛత్తీస్ గఢ్ రూ.5.45 వసూలు చేస్తుంటే.. ఏపీ మాత్రం యూనిట్ రూ.4.40కే ఇస్తుందని చెప్పుకొచ్చారు. తెలంగాణకు కావలి కుక్కలా ఉంటానని చెప్పే కేసీఆర్ ఒక్కో యూనిట్ కు.. రూ.1.05 పైసలు ఎక్కువకు ఒప్పందం ఎందుకు చేసుకున్నట్లు? అన్నది ఒక సందేహంగా మారింది. దీనిపై వెనువెంటనే కేసీఆర్ పెదవి విప్పితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News