కొత్త ప‌ని పెట్టుకున్న కోదండ‌రాం

Update: 2016-10-17 16:51 GMT
తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండరామ్ రాస్త్ర ప్ర‌భుత్వంపై త‌న పోరాట పంథాను కొన‌సాగిస్తూనే ఉన్నారు. సంద‌ర్భానుసారం ఆయా ఆంశాల‌ను ప్ర‌స్తావిస్తూ కోదండ‌రాం గ‌ళం విప్పుతున్నారు. తాజాగా ఆయ‌న‌ కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు విష‌యంలో ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌లో అన్యాయం జ‌రిగిందంటూ ఆత్మ‌హ‌త్య చేసుకున్న వారి కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించిన కోదండ‌రాం తాజాగా రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని క‌లిసి త‌మ అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు.

స‌చివాల‌యంలో సీఎస్‌ రాజీవ్‌ శర్మను కలిసిన అనంత‌రం కోదండ‌రాం మీడియ‌తో మాట్లాడుతూ జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ‌ సంతృప్తికరంగా లేదని  అన్నారు. జిల్లాలు - మండలాల కోసం ఆత్మహత్యలు జరగడం శోచనీయమని, నిరంకుశ పద్దతుల వల్లే ఆందోళనలు కొనసాగుతున్నాయని కోదండ‌రాం త‌ప్పుప‌ట్టారు.  ప్రజాభిప్రాయానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉద్యమం నుంచి వచ్చిన ప్రభుత్వంపై మరింత బాధ్యత ఉందని చెప్పారు. ఆందోళన చేస్తున్న వారితో ప్రభుత్వం చర్చలు జరపాలని - ప్రజలు సీఎంకు కలిసి విన్నవించుకునే అవకాశం కోదండ‌రాం అభిప్రాయపడ్డారు. అంత‌కుముందు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్‌ తుమ్మెదకు చెందిన రాజు తమ మండలాన్ని మెదక్‌ జిల్లాలో ఉంచాలని ట్యాంక్‌ బండ్‌ పై ఆత్మహత్య చేసుకున్ననేప‌థ్యంలో వారి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. రాజు మృతదేహం గాంధీ ఆసుపత్రి మార్చురిలో ఉండడంతో కోదండరాం అక్కడికి వెళ్లి రాజు కుటుంబ సభ్యులతో ఓదార్చారు.ఈ సంద‌ర్భంగా కోదండరాం మాట్లాడుతూ..తమ గ్రామం మెదక్‌ లో ఉండాలని రాజు కోరుకున్నాడని, అది జరగకపోవడంతో తన డిమాండ్‌ సాధనకు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ప్రజల్లోంచి వచ్చే న్యాయబద్ధమైన డిమాండ్లను శాంతిపూర్వకంగా పరిష్కరించడం ప్రభుత్వానికి మంచిదని సూచించారు. కొత్త జిల్లాలపై ఇప్పటికీ ఏవైనా అభ్యంతరాలు - డిమాండ్లు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తామని కోదండరాం తెలిపారు. జిల్లాలు - మండలాల పునర్విభజన విషయంలో బలవన్మరణాలు చోటు చేసుకుంటుండడం దురదృష్టకరమని ఆయ‌న‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News