కేసీఆర్‌కు గ‌తం గుర్తు చేసిన కోదండ‌రామ్‌

Update: 2016-07-18 07:53 GMT
తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్ రాష్ట్ర ప్ర‌భుత్వంపై దూకుడు పెంచారు. ఒక్కో అంశాన్ని ప్ర‌స్తావిస్తూ వ‌స్తున్న కోదండ‌రామ్‌ తాజాగా సింగ‌రేణి గ‌నుల‌ను నెత్తికెత్తుకున్నారు. సింగ‌రేణి కార్మికుల ప‌క్షాన మాట్లాడుతూ ఉద్య‌మ‌కారుడిగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావించారు. కార్మికుల రాష్ట్ర స్థాయి స‌ద‌స్సుల్లో కోదండ‌రామ్‌ మాట్లాడుతూ...సింగరేణిలో ఓపెన్‌ కాస్ట్‌ లను తగ్గించి అండర్‌ గ్రౌండ్‌ గనులను పెంచాలని, అప్పుడే నిరుద్యోగ సమస్య తీరుతుందని చెప్పారు.

సరళీకరణ విధానం వల్లే సింగరేణిలో ప్రయివేటీకరణ పెరిగిందని, ఫలితంగా లక్షల్లో ఉన్న ఉద్యోగుల సంఖ్య వేలల్లోకి పడిపోయిందని కోదండ‌రామ్‌ చెప్పారు. సింగరేణిలో ఏళ్ల‌ తరబడి కాంట్రాక్టు కార్మికులుగా కొనసాగుతున్న వారిని పర్మినెంట్‌ చేయాలని కోరారు. కాంట్రాక్టు కార్మి కులకు ఉద్యోగ భద్రతలేదనీ - నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండటం వల్లే ఇష్టం లేకున్నా ప్రయివేటు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారని వివరించారు. సింగరేణి యాజమాన్యం ఉద్యోగుల కంటే ఎక్కువగా కాంట్రాక్టర్లకే డబ్బు చెల్లిస్తున్నదని చెప్పారు. చట్టపరంగా రావాల్సిన వేతనాల కోసం పోరాడాలని కార్మికులకు సూచించారు. చాలీచాలని వేతనాలతో పిల్లలను చదివించుకోలేక - సరైన వైద్యం చేయించలేక కాంట్రాక్టు కార్మికులు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో సింగరేణి కార్మికుల కృషి ఎనలేనిదని, వారికి జేఏసీ ఎల్లప్పుుడూ అండగా ఉంటుందని కోదండ‌రామ్‌ హామీ ఇచ్చారు. ఉద్యమ సమయంలో ఓపెన్‌ కాస్ట్‌లను వ్యతిరేకించి అధికారంలోకి వచ్చాక ప్రోత్సహించడం స‌రికాద‌ని అన్నారు. ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో రక్షణ చర్యలను పటిష్టం చేసి, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోదండ‌రామ్‌ కోరారు.

కాంట్రాక్టు లేబర్‌ చట్టంలో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని స్పష్టంగా ఉన్నా ప్రభుత్వాలు వాటిని అమలుచేయడం లేదని కోదండ‌రామ్‌ వ్యాఖ్యానించారు. పర్మినెంట్‌ కార్మికులతో సమానంగా కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నప్పుడు ఎందుకు తక్కువ వేతనం ఇస్తున్నారని ప్రశ్నించారు. 2010లో బొగ్గు గని కార్మికులపై ఏర్పాటుచేసిన పార్లమెంటరీ కమిటీ సిఫార్సులను సింగరేణి కార్మికులకు వర్తింపజేయాలని కోదండ‌రామ్‌ డిమాండ్‌ చేశారు.  కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేయాలని ఆగస్టు 1న చేపట్టే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Tags:    

Similar News