చంద్రబాబును ఉతికి ఆరేసిన తెలంగాణ మాస్టారు

Update: 2016-08-14 12:21 GMT
తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం కేసీఆర్ ను విమర్శించడంలో వింతేమీలేదు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కలిసి నడిచినా ఇప్పుడు మాత్రం ఆయన కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అయితే... రాష్ర్ట విభజనకు ముందు చంద్రబాబుపై మండిపడిన కోదండరాంకు ఆ తరువాత ఆయన్ను విమర్శించాల్సిన అవసరం పెద్దగా లేకపోయింది. తెలంగాణకు సంబంధించిన విషయాల్లో మాత్రమే విమర్శలు చేసేవారు. కానీ.. ఈసారి నిరుద్యోగానికి కారణం చంద్రబాబే అంటూ విరుచుకుపడ్డారు. నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి కోసం ఉద్య‌మిస్తామ‌ని ప్ర‌క‌టించిన  కోదండ‌రాం చంద్రబాబు - కేసీఆర్‌ లు ఇద్దరిపైనా మండిప‌డ్డారు.  ఏపీ సీఎం చంద్ర‌బాబు విధానాల‌ను ఆయన  తీవ్ర స్థాయిలో ఎండ‌గ‌ట్టారు. పారిశ్రామిక విధానంలో చంద్ర‌బాబు ప్ర‌వేశ పెట్టిన స‌ర‌ళీకృత విధానాల వ‌ల్ల  తెలంగాణ‌లో నిరుద్యోగ స‌మ‌స్య పెరిగిపోయింద‌ని ఆరోపించారు. ఫ‌లితంగా అనేక ప్ర‌భుత్వ పారిశ్రామిక రంగాలు కుదేల‌య్యాయ‌ని విమ‌ర్శించారు.

ప్ర‌భుత్వ ఉద్యోగాలు రాక‌పోవ‌డానికి కూడా ఆయ‌న ప్ర‌వేశ పెట్టిన కాంట్రాక్టు వ్య‌వ‌స్థే కార‌ణ‌మ‌ని ధ్వ‌జ‌మెత్తారు. పారిశ్రామిక వేత్త‌ల‌కు అనుకూలంగా - నిరుద్యోగ యువ‌త‌కు వ్య‌తిరేకంగా చంద్ర‌బాబు తీసుకున్న ప‌లు నిర్ణ‌యాలే నేడు రెండురాష్ర్టాల్లో నిరుద్యోగం పెరిగిపోయేందుకు కార‌ణ‌మైంద‌ని ఆరోపించారు. చంద్ర‌బాబు ప్ర‌వేశ పెట్టిన విధానాల్లో కాంట్రాక్టు ఉద్యోగాలు - ఔట్ సోర్సింగ్ విధానాలు చాలా దుర్మార్గ‌మైన‌వ‌ని ఆయ‌న అభివ‌ర్ణించారు.

ఏపీ సీఎం చంద్ర‌బాబును ఉతికారేసిన కోదండ‌రాం తెలంగాణ సీఎంనూ వ‌ద‌ల్లేదు. తెలంగాణ వ‌స్తే.. ఉద్యోగాలు వ‌స్తాయ‌ని ఊద‌ర‌గొట్టిన కేసీఆర్ ఆ మేర‌కు ఉద్యోగాల భ‌ర్తీ చేయ‌డం లేద‌ని ఆరోపించారు. తెలంగాణ ఉద్య‌మంలో సింగ‌రేణి కార్మికులను క్ర‌మ‌బ‌ద్ధీక‌రిస్తామ‌ని చెప్పిన కేసీఆర్ సీఎం అయిన త‌రువాత ఆ మాట ఎందుకు నిల‌బెట్టుకోలేద‌ని ప్ర‌శ్నించారు. పారిశ్రామిక‌ - ఉద్యోగ రంగాల్లో చంద్ర‌బాబు సృష్టించి వెళ్లిన పెట్టుబ‌డి దారి అనుకూల దుర్మార్గ‌పు సంప్ర‌దాయాల‌ను కేసీఆర్ కూడా కొన‌సాగించ‌డం దుర‌దృష్ట క‌ర‌మ‌న్నారు. కాంట్రాక్టు కార్మికుల‌ను గ‌త పాల‌కుల కంటే క‌ట్టి బానిస‌లుగా చూస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Tags:    

Similar News