ల‌క్ష ప్ర‌భుత్వ ఉద్యోగాలు కాకి ఎత్తుకుపోయింద‌ట‌

Update: 2017-01-30 06:59 GMT
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌నితీరుపై త‌న‌కు ఉన్న తీవ్ర అసంతృప్తిని జేఏసీ చైర్మెన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం మ‌రోమారు వెళ్ల‌గ‌క్కారు. తెలంగాణ విద్యావంతుల వేదిక-2017 డైరీని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రత్యక్షంగా - పరోక్షంగా తెలంగాణపై ఆంధ్ర పెట్టుబడిదారుల పెత్తనం సాగుతోందన్నారు. మిషన్‌ కాకతీయ - మిషన్‌ భగీరథలో కాంట్రాక్టర్లు ఆంధ్ర ప్రాంతం వారే ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలోని భారీ - చిన్న తరహా పరిశ్రమలో ఉద్యోగాలు కూడా ఇక్కడి యువతకు రావడం లేదన్నారు. ఉద్యమం సందర్భంగా తెలంగాణలో ఏడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి, ఏడాదిలో కేవలం 1600 ఉద్యోగాలను మాత్రం భర్తీ చేశారని తెలిపారు. లక్షల ఉద్యోగాలను ఏ కాకి ఎత్తుకొని పోయిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణను వ్యతిరేకించి, ఉద్యమకారులపై దాడికి పాల్పడిన వారే నేడు తెలంగాణ ప్రభుత్వంలో ముందు వరుసలో ఉన్నారని కోదండరాం వ్యాఖ్యానించారు. ఉద్యమంలో పాల్గొన్న వారు వెనుక వరుసలో ఉన్నారని వాపోయారు. తెలంగాణను వ్యతిరేకించిన పలువురు మంత్రిపదవుల్లో కొనసాగడాన్ని ప్రస్తావిస్తూ ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షకు, ఉద్యమ వ్యతిరేకులకు మధ్య ఘర్షణ జరుగుతోందన్నారు. 2017 తెలంగాణ అభివద్ధి నమూనా సంవత్సరంగా ఉండాలని అన్నారు. సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులనూ ఇక్కడి వారికి ఇవ్వకుండా వలస పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. మిషన్‌ కాకతీయ పనులు కూడా ఇక్కడి వారికే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ రాష్ట్ర అభివృద్ధి పనుల్లో తెలంగాణ వారికే పెద్దపీట వేయాలనీ లేకుంటే తెలంగాణ రాష్ట్రసాధన స్థాయిలో మరో ఉద్యమం వస్తుందని కోదండ‌రాం హెచ్చరించారు. కాలుష్యం పేరుతో వరంగల్‌లోని చిన్న పరిశ్రమలు తరలించడాన్ని ప్రస్తావిస్తూ.. హైదరాబాద్‌లో ఉన్నవి మాత్రం ఎందుకు మూసివేయరని ప్రశ్నించారు. తెలంగాణ జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు అందలేదనీ, ఇళ్లస్థలాలు రాలేదన్నారు. హైకోర్టు విడిపోక పోవడంతో అడ్వకేట్లు ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. మనతో కలిసి పోరాటాలు చేయడానికి అనేకమంది సిద్ధంగా ఉన్నారని వారందరినీ కలుపుకొని పోరాటం చేయాలని కోదండ‌రాం పిలుపునిచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News