కోదండ‌రాం స‌వాల్ చేస్తే ఇలా ఉంటుంది

Update: 2016-07-26 07:35 GMT
తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం మ‌రింత నేరుగా ప్ర‌భుత్వాన్ని ఢీకొట్టారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం పోరాడుతున్న వారిని అరెస్టు చేయ‌డం ఏమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌న‌ను అరెస్టు చేయ‌డం ప‌ట్ల ఏమీ బాధ‌ప‌డ‌టం లేద‌ని పేర్కొంటూ...ప్రజల కోసం ఎన్నిసార్లైనా అరెస్టు కావడానికి, జైలు కెళ్లడానికి సిద్ధంగా ఉన్నామ‌ని క్లారిటీ ఇచ్చారు. ప్ర‌భుత్వాన్ని తీరు మార్చుకోవాల‌ని కోర‌డం కూడా త‌ప్పే అవుతుందా? అంటూ కోదండ‌రాం ప్ర‌శ్నించారు.

విద్యుత్‌రంగ నిపుణులు - టీజేఏసీ కో-చైర్మన్‌ కె. రఘు రాసిన 'తెలంగాణ విద్యుత్‌ రంగంలో ఏం జరుగుతోంది?' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కోదండ‌రాం మాట్లాడుతూ 'మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ డిజైన్‌ పూర్తికాకముందే దౌర్జన్యపూరితంగా భూసేకరణ మొదలైంది. 30-40 రెవెన్యూ బృందాలు గ్రామాల్లోకి వచ్చి సంతకాలు పెట్టమని ప్రజలపై ఒత్తిడి చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని ఉంటే సమస్య అప్పుడే పరిష్కారమయ్యేది. స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా ఆందోళనలు చేపట్టాకే అక్కడికి వెళ్లాం. అపుడు అరెస్టుల‌కు పాల్ప‌డ్డారు. మేం ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు. ప్రత్యామ్నాయాలే చెప్పమంటున్నాం' అని అన్నారు. 'ప్రాజెక్టులపై నిష్పక్షపాతమైన చర్చ అవసరం. మనం మధ్యయుగ సమాజంలో లేము. ప్రభుత్వాలను ప్రజలే ఎన్నుకున్నారు. ఆ స్ఫూర్తితోనే నిర్ణయాలు జరగాలి' అని చెప్పారు. 'ఉమ్మడి రాష్ట్రంలో కాంట్రాక్టర్లు - కార్పొరేట్ల రాజ్యం నడిచింది. తెలంగాణలో ప్రజాభాగస్వామ్యంతో పాలన జరగాలని కాంక్షిస్తున్నాం. దీనికోసం ఎన్నిసార్లు అరెస్టులు - జైళ్లకు వెళ్లడానికైనా సిద్ధం. మాకేం రాజకీయ లక్ష్యాలు లేవు. ప్రజల ఆకాంక్షలే మా అజెండా' అని స్పష్టం చేశారు. 'సీమాంధ్ర తరహా విధాన పాలన సరికాదు. అది హైదరాబాద్‌ కే పరిమితమైంది. తెలంగాణకు స్వతంత్ర అభివృద్ధి నమూనా అవసరం' అని తెలిపారు. 'ప్రజలకు సమాచారం అందించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ప్రొఫెసర్‌ జయశంకర్‌ మాకు నేర్పిన బాధ్యత అది. ప్రజాసమస్యల పరిష్కారాలకై నిరంతరం పోరాడుతూనే ఉంటాం' అని చెప్పారు.

ఇదిలాఉండ‌గా తెలంగాణ ప్ర‌భుత్వంపై నివేదిక రూపొందిస్తున్న‌ట్లు కోదండ‌రాం ప్ర‌క‌టించారు. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రజలు ఇదే కోరుకుంటున్నారని, ఆ ఆలోచనలో నుంచే ఈ పుస్తకం వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం నుంచి పారదర్శక సమాచారం లేదని ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. అందుకే రెండేండ్ల తెలంగాణ సర్కార్‌ నిర్ణయాలపై మేమే నివేదికలు రూపొందిస్తున్నామ‌ని తెలిపారు. దానిలో భాగమే ఈ పుస్తకమ‌ని ఇది ఆరంభం మాత్రమేనని ప్ర‌క‌టించారు.  త్వరలోనే తెలంగాణ తాగు - సాగునీటిరంగాలపై మరో నివేదికను ప్రకటిస్తామ‌ని కోదండరాం చెప్పారు.
Tags:    

Similar News