తెలంగాణ రాజకీయ జేఏసీ చైౖర్మెన్ ప్రొఫెసర్ కోదండరాం మరోమారు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనపై మండిపడ్డారు. రెండున్నరేళ్ల టీఆర్ ఎస్ పాలన చూస్తుంటే రియల్టర్లు, కాంట్రాక్టర్ల కోసం ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా ఉంది తప్ప ప్రజల కోణంలో లేదని ఆయన విమర్శించారు. సీపీఎం పార్టీ చేపట్టిన మహాజన పాదయాత్రకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్న కోదండరాం ఈ సందర్భంగా ప్రసంగించారు. సామాజిక న్యాయం సాధించాలంటే ప్రజలు సంఘటితం కావాలని.. కులాలు - ఆస్తులు - అంతస్తుల ఆధారంగా సాగుతున్న వివక్షను రూపుమాపినప్పుడే సామాజిక న్యాయం సాధించినట్టు అవుతుందని కోదండరాం అన్నారు. సీపీఎం తీసుకున్న డిమాండ్లతో రాజకీయ జేఏసీకి సారూప్యత ఉండడం వల్లే పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నామన్నారు.
అందరికీ న్యాయం జరగాలనే లక్ష్యంతోనే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని కోదండరాం గుర్తుచేశారు. కానీ ప్రజలు కేంద్రంగా పరిపాలన జరగాల్సి ఉండగా అలాంటి పరిస్థితి కనిపించడం లేదని కోదండరాం తెలిపారు. తుకుదెరువును ఇస్తూ ఉపాధి కల్పించే తెలంగాణను ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఇలా అనేక డిమాండ్ల విషయంలో సీపీఎం చేపట్టిన పాదయాత్రతో జేఏసీకి సారూప్యత ఉందని చెప్పారు. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు, 123 చట్టం ప్రకారం భూసేకరణ, ఓపెన్ కాస్ట్ తవ్వకాలు వంటి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామని కోదండరాం వివరించారు. 123 జీవో ద్వారా భూ సేకరణను సుప్రీం కోర్టు కొట్టి వేసిందని గుర్తు చేశారు. నేడున్న పరిస్థితిలో ప్రజల పట్ల బాధ్యతతో పనిచేసే రాజకీయాలు రావాలని ఆకాంక్షించారు. అవినీతి రహిత పాలన కావాలన్నారు. ఇవి అన్ని జరగాలంటే రాజకీయాల్లోనే ప్రక్షాళన జరగాల్సి ఉందని కోదండరాం చెప్పారు. కాళోజీ అదే చెప్పారని గెలవాలంటే నిలవాలన్న సూక్తి ఆధారంగా పనిచేయాల్సి ఉందన్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పక్కకు నెట్టుకుంటూ ముందుకు పోవాలని జేఏసీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. సామాజిక న్యాయం జరగాలంటే ముందు సామాజిక శక్తులు ఏకం కావాలన్నారు. ప్రజల సంఘటిత శక్తిని బట్టే సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. తెలంగాణాలో దీనికి అవకాశాలు ఉన్నాయన్నారు. సామాజిక న్యాయం లక్ష్య సాదనగా జరుగుతున్న తమ్మినేని యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని, ఈ యాత్ర సమాజాన్నే మార్చే విధంగా సాగాలని కోదండరాం అన్నారు.
సామాజిక న్యాయమే లక్ష్యంగా సాగుతున్న తమ యాత్రను కోదండరాం ఆశీర్వదించడంతో తమ శక్తి మరింత పెరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ''90 రోజుల్లో 2వేల 375 కిలో మీటర్లు పూర్తి చేయగా.. 5 మాసాల్లో 4వేల కిలో మీటర్లు పూర్తి చేసి హైదరాబాద్ చేరుకుంటామన్న నమ్మకం కలిగింది. కోదండరాం ఆశీర్వదించడం సంతోషదాయకం'' అన్నారు. మాహబూబాబాద్ లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. తాము ఓట్ల కోసం, రాజకీయంగా బలం పెంచుకోవడం కోసం యాత్ర చేయడం లేదన్నారు. కేసీఆర్ పరిపాలనా విధానాలకు వ్యతిరేకంగా మాత్రమే యాత్ర చేస్తున్నామని వివరించారు. తెలంగాణ వచ్చింది ప్రజల బతుకులు మారడానికి అన్న విషయం ముఖ్యమంత్రి మరిచిపోవొద్దని సూచించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/