చాలారోజుల తర్వాత కేసీఆర్ కు మాష్టారి వార్నింగ్

Update: 2019-08-25 04:48 GMT
ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావటం ఎలానో తెలంగాణ రాజకీయాల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ఎంత కష్టపడ్డారో.. అంతకు మించి పడటమే కాదు.. మలిదశ ఉద్యమం మొత్తం కోదండం మాష్టారి చుట్టూ తిరిగిందన్నది కాదనలేని నిజం. మరి.. అలాంటి కోదండం మాష్టారు ఇప్పుడెక్కడ? అంటే.. భూతద్దం వేసి వెతకాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలో కోదండం మాష్టారి నోటి నుంచి ఏదైనా మాట వచ్చిందంటే అది ఫస్ట్ పేజీ వార్తే. లేకుంటే.. ఆంధ్రా పత్రికలు తమ బుద్ధిని చూపించుకున్నట్లే.

తెలంగాణ వచ్చింది. కేసీఆర్ చేతికి అధికారం వచ్చింది. కాలం అలా కదిలేసరికి.. కోదండం మాష్టారి ఇమేజ్ తగ్గటమే కాదు.. ఆయన మాటకు పత్రికల్లో ఇచ్చే ప్రాధాన్యత తగ్గిపోయింది. ఉద్యమ వేళలో కోదండం మాష్టారి మాటే ప్రసాదంగా మారి.. ఆయనేం చెబితే ఆ విషయాలన్ని పొల్లు పోకుండా బ్యానర్ వార్తలుగా మారిన స్థాయి నుంచి తాజాగా సింగిల్ కాలమ్ ఐటెమ్ గా మారి.. ఎక్కడో అప్రాధాన్యత స్థానంలో పడి.. కనిపించకుండా పోతున్న పరిస్థితి. దీంతో.. ఆయన ఎంతలా మాట్లాడినా ప్రజల కంట్లో పడని పరిస్థితి.

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ.. పార్లమెంటు ఎన్నికల తర్వాత నుంచి కోదండం మాష్టారి ప్రభ మరింత మసకబారిపోయింది. ఎన్నికల్లో ఆయన ఎలాంటి ప్రభావం చూపించలేకపోవటం.. ఒక్కటంటే ఒక్క సీటు ఆయన పార్టీ గెలవలేకపోవటంతో రాజకీయ వర్గాల్లో ఆయన ఆరు వేలుగా మారిపోయారు. ఉద్యమ వేళలో చక్రం తిప్పింది ఈ పెద్ద మనిషేనా? అన్న అనుమానం కలిగే పరిస్థితి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గట్టిగా మాట్లాడారు కోదండం మాష్టారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడితే ప్రభుత్వానికి పెట్టుబడి ఖర్చు.. నిర్వాహణ వ్యయం తక్కువ అయ్యేదన్న ఆయన.. ఇప్పటికైనా కేసీఆర్ తాను చేసిన తప్పును తెలుసుకొని సరిచేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు.. తాను పెట్టిన తెలంగాణ జన సమితి నేతలతో కలిసి తుమ్మిడిహెట్టిని సందర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చుతో కూడుకున్నదని.. దీన్ని పూర్తి చేయటానికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కడితే జిల్లా ప్రజల తాగునీటి.. సాగునీటి అవసరాల్ని తీర్చేదన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని.. కేసీఆర్ తనతప్పును సరిదిద్దుకోవాలని.. ఇప్పటికైనా తన ఆలోచనల్ని మార్చుకోవాలన్నారు. లేదంటే తాను ప్రజలతో కలిసి ఉద్యమిస్తానని హెచ్చరిక జారీ చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇప్పటికే కేసీఆర్ డిసైడ్ కావటమే కాదు.. తాను అనుకున్నట్లుగా పూర్తి చేయాలని పట్టుబట్టి ఉన్న వేళ.. కోదండం మాష్టారి మాటలకు కేసీఆర్ పట్టించుకుంటారా? అన్నది ప్రశ్న. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తుమ్మడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలన్న పాత చింతకాయ మాటను కాస్తంత కొత్తగా చెబితే బాగుండేది. అంతేకాని.. చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని మాష్టారు ఎందుకు మిస్ అవుతున్నట్లు?
Tags:    

Similar News