కోదండం మాష్టారికి హోంగార్డులు గుర్తుకొచ్చారు

Update: 2016-07-16 04:56 GMT
ఆచితూచి అన్నట్లుగా తెలంగాణ సర్కారుపై విమర్శలు చేసేందుకు.. తప్పు పట్టేందుకు సంశయించిన తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం తాజాగా అలాంటి వాటిని వదిలేసినట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్ సర్కారు తీరుపై పూర్తిస్థాయిలో అసంతృప్తిలో ఉన్న ఆయన..  ఒక్కొక్క అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. సలహాల రూపంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపే ప్రయత్నం చేసిన కోదండరాంపై గులాబీ దళం నిప్పులు చెరుగుతున్న వేళ.. మొహమాటపు పరదాల్ని పక్కన పెట్టేయాలని కోదండం మాష్టారి డిసైడ్ కావటం తెలిసిందే.

తెలంగాణ సర్కారు చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టుల రీ డిజైనింగ్ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన.. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని సున్నితంగా ఎత్తి చూపే ప్రయత్నం చేయటం.. దానిపై తెలంగాణ అధికారపక్షం నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న వేళ.. ఆయన కేసీఆర్ సర్కారు తీరుపై పోరుబాట పట్టేందుకే మొగ్గు చూపుతున్నట్లుగా చెప్పాలి. ప్రాజెక్టుల రీడిజైనింగ్ అంశంపై విమర్శలు చేయొద్దని.. అలా చేయటమంటే..తెలంగాణ వృద్ధిని అడ్డుకోవటంగా అభివర్ణిస్తున్న వారిమాటలు కోదండరాంకు తీవ్ర అసంతృప్తిని.. ఆగ్రహానికి గురి చేస్తున్నట్లుగా చెప్పాలి.

ప్రాజెక్టుల రీడిజైనింగ్ తోపాటు.. తెలంగాణ విద్యా వ్యవస్థ.. నిరుద్యోగం మీద మాట్లాడుతున్న ఆయన తాజాగా మరో అంశంపై దృష్టి సారించారు. తెలంగాణలో పని చేస్తున్న హోంగార్డుల అంశాన్నితెర మీదకు తీసుకొచ్చారు. నిబద్ధతతో పని చేసే హోంగార్డుల విషయంలో ప్రభుత్వం స్పందించాలని.. వారికి గౌరవం తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకోవటంతో పాటు.. వారి సర్వీసుల్ని క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. చూస్తుంటే.. కోదండం మాష్టారు వ్యూహాత్మకంగా ఒక్కొక్క అంశం మీద దృష్టి సారిస్తూ.. తెలంగాణ రాష్ట్ర సర్కారు చేస్తున్న తప్పుల్ని తెర మీదకు తెస్తున్నారన్న భావన కలుగుతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News