ఇది కోదండ‌రాంకు మొద‌టి ఓటమితో స‌మానం

Update: 2018-09-11 07:38 GMT
తెలంగాణ రాష్ట్రంలో ఉద్య‌మ‌కారుల‌కు వేదిక‌గా నిలుస్తుంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు అంచ‌నా వేసిన ప్రొఫెస‌ర్ కోదండ‌రాం సార‌థ్యంలోని తెలంగాణ జనసమితి పార్టీ ఊహించ‌ని చిక్కుల్లో ప‌డిపోతోంది. ఇప్ప‌టికే  ఆ పార్టీ మహిళా నేత ఫ్రొఫెసర్ జ్యోత్స్న సంచలన వ్యాఖ్యలు చేసిన సంగ‌తి తెలిసిందే. పార్టీలో టిక్కెట్లు అమ్ముతున్నారని, పార్టీలోని సీనియర్‌ నేత కపిల్‌ వాయి దిలీప్‌ కుమార్‌ తోపాటు మరో ఐదుగురు ఈ వ్యవహారం నడుపుతున్నారని ఆరోపిస్తూ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీలో వసూల్‌ రాజాలు ఎక్కువ మందే ఉన్నారని, దిలీప్‌ కుమార్‌ కు తాను రూ.2 లక్షలు ఇచ్చానని, ఎంతోమంది నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి పార్టీలో ఎందుకు అంత ప్రాధాన్యత‌ ఇస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. దిలీప్‌ పై తాను చేసే ప్రతీ ఆరోపణకు రుజువులున్నాయని, ఈ విషయంపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని వ్యాఖ్యానించారు. పార్టీ ఫండ్‌ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని అన్నారు.

ఇలా ఓ వైపు పార్టీ విలువ‌లప‌రంగా బ‌ల‌హీన‌ప‌డుతున్న స‌మ‌యంలో రాజ‌కీయంగా మ‌రో స‌మ‌స్య ఎదురైంది. గతంలో ఒంటరిగానే పోటీ చేస్తామని కోదండరాం పదేపదే చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఇపుడు ఆ ప‌రిస్థితి లేద‌ని తెలుస్తోంది. పార్టీప‌రంగా బ‌లోపేతం కాక‌పోవ‌డం ఒక కార‌ణ‌మైతే...రాజ‌కీయంగా అనివార్య‌త మరో కార‌ణం అంటున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ ఎస్‌ అధినేత కేసీఆర్‌ కు వ్యతిరేకంగా తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ ఏకమవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఇందుకు కోదండ‌రాం మొద‌ట వ్య‌తిరేకించారు. గతంలో ఒంటరిగానే పోటీ చేస్తామని పదేపదే చెప్పిన కోదండరాం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మహాకూటమిలో చేరాలని నిర్ణయానికొచ్చినట్టు తెలిసింది. ఇందులో భాగంగా టీఆర్ ఎస్‌ కు వ్యతిరేకంగా ఏర్పడుతున్న కూటమిలో చేరే విషయంపై టీజేఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌. రమణతో హైదరాబాద్‌ లో రహస్యంగా సమావేశమయ్యారు. కూటమిలో చేరితే తమపాత్ర ఎలా ఉండాలనే దానిపైనా పార్టీ సహచరులతో కోదండరాం ఇప్పటికే చర్చలు మొదలుపెట్టారు.

మ‌రోవైపు కాంగ్రెస్ వైపు నుంచి ఎలాంటి స్పంద‌న రాక‌పోవ‌డంతో డైల‌మా నెల‌కొంది. గ‌తంలో ప్రాథ‌మికంగా పొత్తు ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్ప‌టికీ టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి - ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ఇప్పటివరకు నేరుగా సమావేశం కాలేదు. ఇందుకు టీజేఎస్ కార‌ణ‌మ‌ని అంటున్నారు. టీజేఎస్‌ మాత్రం తన బలానికి మించి సీట్లు అడుగుతోందని, అందుకే ఆ పార్టీతో పొత్తుకు దూరంగా ఉంటున్నామ‌ని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. స్థూలంగా కోదండ‌రాంకు ఆప్ష‌న్ లేకుండా విప‌క్షాలు చేశాయ‌ని అంటున్నారు.

Tags:    

Similar News