కోదండరాం.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి

Update: 2019-02-28 17:30 GMT
అనుకున్నది ఒక్కటి.. అయ్యిందొక్కటి.. కోదండరాం పార్టీ తెలంగాణ ఎన్నికల్లో బొక్క బోర్లాపడింది. ప్రజల నాడి తెలుసుకోకుండా.. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో జట్టుకట్టిన టీజేఎస్ అధినేత - ప్రొఫెసర్ కోదండరాం దారుణంగా దెబ్బతిన్నారు. ఎంతలా అంటే.. తెలంగాణ ఎన్నికల ఫలితాలతో కనుమరుగైపోయేంతగా..

అవును.. ఇప్పుడు కోదండరాం తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద కనిపించడం లేదు. మీడియా వార్తల్లో అగుపించడం లేదు. ఆయన బైట్ కూడా దొరకడం లేదు. మొన్నటి తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేతలను మించి కోదండరాం లాబీయింగ్ చేశారు.. ‘కేసీఆర్ శాశ్వతంగా ఫాంహౌస్ లోనే పంటాడు’ అంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. కానీ జనం కేసీఆర్ వైపే ఉన్నారు. అందుకే కోదండరాంను ఇంటికే పరిమితం చేశారు.

అయితే ఎంత పెద్ద ప్రొఫెసర్ అయినా..ఎంత రాజకీయ - సామాజిక అనుభవం ఉన్నా పొరపాట్లు చేస్తే భవిష్యత్ ఉండదని కోదండరాం ను చూస్తే అర్థమవుతోంది. ఆయనకు తెలంగాణ సమాజంలో మంచి పేరు ఉంది. కానీ ఆ పేరును వినియోగించుకొని బరిలోకి దిగితే అన్నో ఇన్నో సీట్లు గెలిచేవాడు. ప్రజారంజక పాలన చేసిన కేసీఆర్ పాలన లోపాలను తిడితే బాగుండేది.కానీ కేసీఆర్ మీద వ్యక్తిగత దాడి చేసి కోదండరాం అభాసుపాలయ్యారు. కాంగ్రెస్ తో వెళ్లి నిండా మునిగారు.

కనీసం పార్టీని అయినా తప్పులు తెలుసుకొని పదికాలాల పాటు నడిపిస్తాడనుకుంటే ఇప్పుడు కోదండరాం వైఖరి నచ్చక ఒక్కరొక్కరే టీజేఎస్ పార్టీని వీడుతుండడం కలవరపెడుతోంది. తాజాగా టీజేఎస్ లో ముసలం మొదలైంది. మహబూబ్ నగర్ జిల్లా టీజేఎస్ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నేత జి. రాజేందర్ రెడ్డి కోదండరాం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈయనతోపాటు మంచిర్యాల జిల్లా టీజేఎస్ ఇన్ చార్జి, పార్టీ కోర్ కమిటీ సభ్యుడు గురిజాల రవీందర్ కూడా బుధవారం టీజేఎస్ కు రాజీనామా చేశారు. కోదండరాం తీరు, విధానాలు నచ్చకపోవడం వల్లే తాము రాజీనామా చేస్తున్నట్టు స్పష్టం చేశారు. కోదండరాంకు ఘాటు లేఖ కూడా రాశారు. ఇలా పార్టీని నడపలేక.. రాజకీయాలు చేయలేక మాస్టారు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావంటున్నారు ఆయన సన్నిహితులు.
   

Tags:    

Similar News